శ్రీలంకలో ఇండియన్ హై కమిషన్‌కూ ముప్పు!


కొలంబో : శ్రీలంక రాజధాని నగరం ఆదివారం బాంబు పేలుళ్ళతో దద్దరిల్లింది. అమాయకులు దారుణంగా బలైపోయారు. ప్రపంచమంతా విచారం వ్యక్తం చేస్తోంది. ఇటువంటి ముప్పు పొంచి ఉందని 10 రోజుల క్రితమే శ్రీలంక పోలీస్ చీఫ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా గట్టి చర్యలు తీసుకుని ఉంటే, ఇంతటి దారుణం జరిగి ఉండేది కాదేమో?
 
శ్రీలంక పోలీస్ చీఫ్ పుజుత్ జయసుందర ఈ నెల 11న నిఘా సమాచారం ఆధారంగా హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తోంది. అత్యున్నత స్థాయి అధికారులకు ఈ హెచ్చరిక సందేశాలను పంపించినట్లు సమాచారం. ప్రముఖ చర్చిలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు కుట్ర జరుగుతున్నట్లు హెచ్చరించారు.
 
నేషనల్ తౌహీత్ జమాత్ (ఎన్‌టీజే) అనే రాడికల్ ముస్లిం గ్రూప్ శ్రీలంకలో గత ఏడాది వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం బుద్ధ విగ్రహాల కూల్చివేతలో ఈ గ్రూప్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
‘‘నేషనల్ తౌహీత్ జమాత్ (ఎన్‌టీజే) ప్రముఖ చర్చిలు, కొలంబోలోని ఇండియన్ హై కమిషన్‌లపై ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నుతున్నట్లు ఓ విదేశీ నిఘా సంస్థ తెలిపింది’’ అని శ్రీలంక పోలీస్ చీఫ్ పుజుత్ పంపిన హెచ్చరిక సందేశంలో పేర్కొన్నారు.
 
ఆదివారం ఉదయం నుంచి జరిగిన 8 బాంబు పేలుళ్ళలో 190 మంది మరణించినట్లు శ్రీలంక అధికారులు ప్రకటించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *