శ్రీలంకలో నెత్తుటేరులు


 • ఉగ్రవాదుల మారణహోమం..
 • 8 వరుస బాంబు పేలుళ్లు
 • క్షతగాత్రులు 500పైనే..
 • మృతుల్లో ముగ్గురు భారతీయులు
 • 215మంది మృతి
 • పవిత్ర ఈస్టర్‌ సండే రోజున 3 చర్చిల్లో దారుణం
 • విదేశీయులే లక్ష్యంగా మూడు లగ్జరీ హోటళ్లలోనూ
 • వాటిలో రెండు చోట్ల ఆత్మాహుతి ఉగ్ర దాడులు
 • మృతుల్లో 35 మంది విదేశీయులే
 • చెల్లాచెదురుగా శవాలు.. అంతటా మాంసపు ముద్దలు
 • ఉగ్రవాదులను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులు
 • తనను తాను పేల్చేసుకున్న ఆత్మాహుతి దళ సభ్యుడు
 • కుప్పకూలిన శ్లాబ్‌.. ఆ ధాటికి ముగ్గురు పోలీసుల మృతి

ఈస్టర్‌ సండే! క్రీస్తు పునరుత్థానమైన పండగ రోజు! ఉదయం 8.45 గంటలు! శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆంథోనీ చర్చిని విద్యుత్తు దీపాలు, రకరకాల పువ్వులతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది క్రైస్తవులు తరలి వచ్చారు. పునర్జీవితుడైన క్రీస్తును స్మరిస్తూ అంతా సామూహికంగా ప్రార్థనలు చేస్తున్నారు! కొత్త దుస్తులు ధరించి వచ్చిన క్రైస్తవులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటున్నారు! అంతటా ఆనందం! కానీ ఆ పండుగ రోజే తమకు ఆఖరి రోజు అవుతుందని వారు ఊహించలేదు! ఉదయం ఆ చర్చిలో మొదలైన పేలుళ్లు సాయంత్రం వరకూ శ్రీలంకను కుదిపేశాయి. ఒకదాని తర్వాత ఒకటిగా ఎనిమిది పేలుళ్లు! దారుణాతి దారుణం! విచక్షణ మరిచిన వికటాట్టహాసం! లంకలో నరరూప రాక్షసులు రాసిన మారణహోమం!!
 
కొలంబో, ఏప్రిల్‌ 21: శ్రీలంకలో ఉగ్రవాదులు పక్కా ప్రణాళిక ప్రకారం.. మూడు చర్చిలు, మూడు లగ్జరీ హోటళ్లలో ఏక కాలంలో రక్తపుటేర్లు పారించారు. ఎనిమిది వరుస బాంబు పేలుళ్లతో మారణ హోమం సృష్టించారు. వీటిలో ఏడు పశ్చిమ తీరంలోని కొలంబో, దాని చుట్టుపక్కల జరగగా.. మరొకటి తూర్పు తీరంలోని బట్టికలోవలో చోటుచేసుకుంది. వీటిలో రెండుచోట్ల ఆత్మాహుతి దళాలు స్వయంగా దాడులు చేశాయి. ఈ ఉగ్ర దాడుల్లో 215 మంది చనిపోయారు. 500 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. దాంతో, మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. మృతుల్లో 35 మంది వరకూ విదేశీయులు ఉన్నారు. వీరంతా చైనా, అమెరికా, బ్రిటన్‌, పోర్చుగీస్‌ తదితర దేశాలకు చెందిన వాళ్లు. ఒకచోట పేలుడు జరిగిందని సమాచారం వచ్చిన వెంటనే.. మరోచోట! ఉదయం 8.45 నుంచి 9 గంటల మధ్యలో ఏకంగా ఆరుచోట్ల పేలుళ్లు.
 
హమ్మయ్య.. పేలుళ్లు ఆగిపోయాయని అనుకుంటున్నంతలోనే మధ్యా హ్నం మరో రెండు పేలుళ్లు! పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత రాత్రి కూడా మరొకటి! ఉదయం నుంచి రాత్రి వరకూ.. తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరం వరకూ.. వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంకలో తీవ్ర భయానక వాతావరణం ఏర్పడింది. ఇంకా ఎక్కడ పేలుళ్లు జరుగుతాయో తెలియని పరిస్థితి. ఎల్టీటీఈతో అంతర్యుద్ధం తర్వాత శ్రీలంక చాలా వరకూ ప్రశాంతంగానే ఉంది. తాజా ఉగ్ర దాడులతో అక్కడ శాంతికి విఘాతం కలిగింది. శ్రీలంక చరిత్రలోనే అత్యంత దారుణ రక్తపాతాల్లో ఇది ఒకటి!! ఉగ్ర దాడుల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం కర్ఫ్యూ ప్రకటించింది. సోషల్‌ మీడియాను బ్లాక్‌ చేసింది. భద్రతను పటిష్ఠం చేసింది. కాగా, దాడులకు తమదే బాధ్యత అంటూ ఇప్పటి వరకూ ఎవరూ ప్రకటించుకోలేదు. కానీ, పోలీసులు మాత్రం ఏడుగురు అనుమానితులను అరెస్టు చేశారు.
 
తూర్పు పశ్చిమ తీరాల్లోని మూడు చర్చిల్లో..
కొలంబో.. దానికి 37 కిలోమీటర్ల దూరంలో నెగోంబో పట్టణం శ్రీలంకకు పశ్చిమ తీరంలో ఉంటాయి. కొలంబోకు దాదాపు 320 కిలోమీటర్ల దూరంలోని తూర్పు తీరంలో బట్టికలోవ ఉంటుంది. తూర్పు, పశ్చిమ తీరాల్లో ఉన్న కొలంబోలోని సెయింట్‌ ఆంథోనీ చర్చి, నెగోంబోలోని సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చి, బట్టికలోవలోని సెయింట్‌ మైఖేల్‌ చర్చిపై ముష్కర మూకలు ఏకకాలంలో ఉగ్ర దాడులు చేశాయి. తొలుత ఆంథోనీ చర్చిలో.. రెండో పేలుడు సెబాస్టియన్‌ చర్చిలో చోటుచేసుకుంది. ‘‘మా చర్చిపై బాంబు దాడి జరిగింది. దయచేసి రండి.. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే సహకరించండి’’ అని సెబాస్టియన్‌ చర్చి ఫేస్‌బుక్‌ పేజీలో పిలుపునిచ్చారు. చర్చి సీలింగ్‌ కూడా పగుళ్లు ఇచ్చిందంటే పేలుడు ఎంత శక్తిమంతమైనదో అర్థం చేసుకోవచ్చు. ఒక్క సెబాస్టియన్‌ చర్చిలోనే 74 మంది చనిపోయారు. 113 మందికిపైగా గాయపడ్డారు.‘‘సామూహిక ప్రార్థనలు జరుగుతున్న సమయంలో వరుస పేలుళ్లు సంభవించాయి.
 
చర్చి లోపల.. బయట.. గోడలపై.. శాంక్చురీ (చర్చిలో పవిత్ర స్థానం)పై ఎక్కడ చూసినా మాంసపు ముద్దలు. ఎక్కడ చూసినా గాజు ముక్కలు.. చర్చి లోపల 30 మృతదేహాలు పడి ఉన్నాయి’’ అని సెబాస్టియన్‌ చర్చి ఫాదర్‌ ఎడ్మండ్‌ తిలక్‌రత్నే తెలిపారు. ఆ సమయంలో ముగ్గురు మత గురువులు ప్రార్థనలు నిర్వహిస్తున్నారని, వారిలో ఇద్దరికి తీవ్రంగా, ఒకరికి స్వల్పంగా గాయాలయ్యాయని చెప్పారు. ఈస్టర్‌ పండుగ కావడంతో వెయ్యి మందికిపైగా క్రైస్తవులు చర్చికి తరలివచ్చారని వివరించారు. ఆంథోనీ చర్చిలో పేలుడు ధాటికి రూఫ్‌ మొత్తం తునాతునకలైంది. రూఫ్‌ టైల్స్‌, గ్లాస్‌ తదితరాలు చెల్లాచెదురుగా పడ్డాయి.ఇక, బట్టికలోవ చర్చిలో ఈస్టర్‌ వేడుకలకు భారత్‌, పాకిస్థాన్‌, అమెరికా, మొరాకో, బంగ్లాదేశ్‌ తదితర దేశాల నుంచి కూడా విదేశీయులు వచ్చారు. వీరిలో అత్యధికులు గాయపడ్డారు. బట్టికలోవ ఆస్పత్రికే వందమందికిపైగా క్షతగాత్రులను తీసుకొచ్చారని ఆస్పత్రి అధికార ప్రతినిధి డాక్టర్‌ కళానిధి గణేశలింగం తెలిపారు. పేలుళ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈస్టర్‌ ప్రార్థనలను కార్డినల్‌ మాల్కం రంజిత్‌ రద్దు చేశారు.
 
మూడు లగ్జరీ హోటళ్లలో..
చర్చిలతోపాటు విదేశీయులు ఎక్కువగా బస చేసే లగ్జరీ హోటళ్లనూ ఉగ్రవాదులు టార్గెట్‌ చేశారు. కొలంబోలోని షాంగ్రీలా, సిన్నమాన్‌ గ్రాండ్‌, కింగ్స్‌బరీ ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. సిన్నమాన్‌ గ్రాండ్‌ హోటల్లో ఆత్మాహుతి దళ సభ్యుడు తనకు తాను పేల్చేసుకున్నాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ‘‘కిక్కిరిసి పోయిన రెస్టారెంట్‌లో టిఫిన్‌ తీసుకోవడానికి చాలామంది క్యూలో ఉన్నారు. వీపునకు పేలుడు పదార్థాలు కట్టుకున్న ఆత్మాహుతి దళ సభ్యుడు కూడా ప్లేటు పట్టుకుని క్యూలో చాలాసేపు వేచి ఉన్నాడు. వడ్డించే చోటు వరకూ ఓపిగ్గా వచ్చాడు.
 
ఇక, తనకు వడ్డిస్తారనగా ఒక్కసారిగా పేల్చేసుకున్నాడు’’ అని సిన్నమాన్‌ గ్రాండ్‌ హోటల్‌ మేనేజర్‌ తెలిపారు. హోటల్లో తన పేరును మహమ్మద్‌ అజ్జాం మహమ్మద్‌గా పేర్కొన్నాడని వివరించారు. అతిథులను ఆహ్వానిస్తున్న తమ మేనేజర్‌ కూడా అక్కడికక్కడే చనిపోయారన్నారు. ఉగ్రవాది శ్రీలంక పౌరుడేనని పోలీసులు తెలిపారు. అదే సమయంలోనే, షాంగ్రీలా, కింగ్స్‌బరీ హోటళ్లలోనూ పేలుళ్లు జరిపారని వివరించారు. షాంగ్రీలా హోటల్లో ఉదయం 9 గంటలకు రెండు భారీ పేలుళ్లు జరిగాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అనంతరం, కొన్ని గంటల తర్వాత కొలంబో జూ సమీపంలోని హోటల్లో ఏడో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారని పోలీసులు తెలిపారు.
 
ఉగ్రవాదులను పట్టుకోబోయి..
ఉగ్రవాద దాడుల నేపథ్యంలో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో కొలంబోకు ఉత్తరంగా ఉన్న ఒరుగొడవట్టలోని ఓ ఇంట్లో సోదాలు చేశారు. పోలీసులు రావడాన్ని చూసిన ఆత్మాహుతి దళ సభ్యుడు రెండో అంతస్తులో తనకు తాను పేల్చేసుకున్నాడు. దాంతో, కాంక్రీట్‌ శ్లాబ్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే చనిపోయారు. దీనిని ఎనిమిదో పేలుడుగా శ్రీలంక పోలీసులు అభివర్ణిస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *