శ్రీలంక పోలీసు చీఫ్‌పై వేటు.. తప్పుకునేందుకు ససేమిరా


కొలంబో, ఏప్రిల్‌ 29: శ్రీలంక పోలీసు చీఫ్‌ పుజిత్‌ జయసుందరపై ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సోమవారం సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆయన స్థానంలో సీనియర్‌ డీఐజీ సీడీ విక్రమరత్నేను, రక్షణ శాఖ కార్యదర్శిగా మాజీ ఐజీ ఎన్‌కే ఇల్లంగకూన్‌ను తాత్కాలికంగా నియమించారు. అయితే తాను తప్పుకొనే ప్రసక్తే లేదంటూ అధ్యక్షుడి ఆదేశాలను జయసుందర ధిక్కరించారు. రక్షణ మంత్రి రాజీనామా చేస్తేనే తాను వైదొలుగుతానని ఆయన పట్టుబడుతున్నారు. శ్రీలంక పోలీసు చీఫ్‌ను పార్లమెంటరీ ప్రక్రియ ద్వారానే తొలగించడం సాధ్యమవుతుంది. త్వరలో పార్లమెంటులో ఈమేరకు తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. శ్రీలంకలో నరమేధానికి బాధ్యత వహిస్తూ రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో రాజీనామా చేసినా.. జయసుందర మాత్రం ససేమిరా అన్నారు.
 
ఈ నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది. కాగా.. శ్రీలంకలో బౌద్ధ ఆలయాలపై భక్తుల వేషంలో మహిళా బాంబర్లు దాడులకు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. తూర్పు ప్రావిన్సులోని సైంతమురుతు ప్రాంతంలో పేలుడు తర్వాత పోలీసులు ఒక ఇంటిపై దాడి చేశారు. ఆ ఇంట్లో అయిదు జతల తెలుపు రంగు స్కర్టులు, బ్లౌజులు ఉండడాన్ని గుర్తించి, ఆరా తీశారు. మార్చి 29న ఒక దుకాణంలో ఓ ముస్లిం మహిళ 29 వేల శ్రీలంక రూపాయలు వెచ్చించి మొత్తం తొమ్మిది జతలను కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజి ద్వారా కనుగొన్నారు. స్థానిక ఉగ్రవాద సంస్థ ఎన్‌టీజేకు చెందిన మహిళలు బౌద్ధ మందిరాలపై భక్తుల వేషంలో దాడులు పాల్పడేందుకే ఆ దుస్తులను కొనుగోలు చేసినట్లు అంచనాకు వచ్చారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *