‘సంకీర్ణం’తో సాధిస్తాం!


  • సంస్కరణల తర్వాత వచ్చినవి అవే.. చక్కటి పాలనను అందించాయి
  • పూర్తి మెజారిటీతో బీజేపీ చేసిందేమిటి?
  • ఈ ఎన్నికల్లో మా గెలుపు ఖాయం.. రాష్ట్రాభివృద్ధికే నా ప్రాధాన్యం
  • జాతి నిర్మాణంలోనూ నా పాత్ర
  • ఆంగ్ల చానల్‌ సదస్సులో సీఎం స్పష్టీకరణ
అమరావతి, మే 3 (ఆంధ్రజ్యోతి): ‘‘దేశంలో ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత వచ్చినవన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే. అవన్నీ చక్కటి పాలన అందించాయి. గత ఎన్నికల్లో ప్రజలు ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చారు. దాని వల్ల ఒరిగిందేమిటి? ఆర్థిక వ్యవస్థ ఏమైంది! నోట్ల రద్దు ఎన్ని దుష్ఫలితాలను ఇచ్చింది! నిరుద్యోగం, వ్యవసాయం ఇలా ప్రతి రంగంలోనూ సంక్షోభాలను చూస్తున్నాం. రూపాయి విలువ పడిపోయింది. సంకీర్ణమా లేక ఒకే పార్టీ ప్రభుత్వమా అన్నది ముఖ్యం కాదు. ఎవరు మంచి పాలన ఇచ్చారన్నది ముఖ్యం. అంతకుముందున్న యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు ఎన్నో మంచి ఫలితాలు ఇచ్చాయి. దీనిని గుర్తుంచుకోవాలి’’ అని టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన ఒక ఆంగ్ల వార్తా చానల్‌ శుక్రవారం నిర్వహించిన జాతీయ స్థాయి చర్చలో ఆయన అమరావతి నుంచి పాల్గొన్నారు. వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ వివరాలు సంక్షిప్తంగా…
 
అమరావతి నిర్మాణ ప్రగతి ఎలా ఉంది?
సైబరాబాద్‌ను నిర్మించిన అనుభవంతో ఇప్పుడు పూర్తిగా ఒక కొత్త నగరాన్ని నిర్మించబోతున్నాం. పక్కనే కృష్ణా నది ఉండటం వరం. అమరావతి నాలెడ్జ్‌ ఎకానమీకి ప్రతిరూపంగా నిలవబోతోంది. ప్రపంచంలో ఐదు ఉత్తమ నగరాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంటుంది. డబ్బులు లేకుండా రాజధాని నిర్మించడం ఒక సవాలు. ప్రస్తుతం ఇక్కడ రూ.40వేల కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు జరుగుతున్నాయి.
 
రాజధాని నిర్మాణం ఆలస్యం కావడం లేదా?
ఒక ఇల్లు కట్టాలంటే రెండు మూడేళ్లు పడుతుంది. ఒక హోటల్‌ నిర్మించాలంటే నాలుగైదేళ్లు పడుతుంది. రాజధాని నిర్మించాలంటే స్థలం ఎంపిక, భూ సేకరణ, నిర్మాణ ప్రణాళిక, డిజైన్ల తయారీ, నిధుల సమీకరణ, మౌలిక వసతుల అభివృద్ధి వంటి ఎన్నో పనులు ఉంటాయి. గాంధీనగర్‌, నయా రాయపూర్‌, చండీగఢ్‌ నగరాల నిర్మాణానికి ఎంత కాలం పట్టిందో చూడండి.
 
మూడో ఫ్రంట్‌ యత్నాలు కొలిక్కొచ్చినట్లు లేదు?
పార్టీలకు కొన్ని రాజకీయ ప్రతిబంధకాలు ఉంటాయి. కానీ, మోదీ నియంతృత్వ ధోరణి వల్ల అందరూ కలిసి వస్తున్నారు. కొన్ని సమస్యలు ఉన్నా ఎన్నికల తర్వాత అందరం కలిసి కూర్చుంటాం. కేంద్రంలో కొత్త ప్రభుత్వం రాబోతోంది. కొత్త ప్రధాని రాబోతున్నారు.
 
ప్రతిపక్షంలో ఎవరు ప్రధానో స్పష్టత లేదు కదా?
1991 తర్వాత దేశంలో అనేక సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చాయి. వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాలు కూడా సంకీర్ణ ప్రభుత్వాలే. అవన్నీ చక్కగా పాలించాయి. గత ఎన్నికల్లో ఒక పార్టీకి పూర్తి మెజారిటీ ఇస్తే దేశానికి ఏం ఒరిగింది? ప్రపంచంలో మూడు పెద్ద ఆర్థిక వ్యవస్ధల్లో ఒకటిగా నిలిచే శక్తి మనకు ఉంది. ఒక మంచి నాయకుడు ఉంటే చాలు. ఐదేళ్ల కిందట మోదీ కూడా ఒక చిన్న రాష్ట్రానికి సీఎం మాత్రమే. మీరిప్పుడు అంత గొప్ప నాయకుడు లేడని అం టున్నారు. అవకాశాలొస్తే అం దరూ తమ ప్రతిభ చూపగలరు.
 
జాతీయ భద్రత తమ ఘనత అని బీజేపీ అంటోంది కదా..
ఈ దేశంలో ప్రతి ఒక్కరూ దేశ భక్తి ఉన్నవారే. దేశ భద్రత కోసం త్యాగానికి ఎవ రూ వెనకడుగు వేయరు. ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. అన్ని దే శాలు కలిసి దానిపై పోరాడాలి. పాకిస్థాన్‌లాంటి చిన్న దేశంతో భారత్‌ను పోల్చి కాపాడుతున్నామని చెప్పడం సరికాదు. మన దేశంలో ఒకటో రెండో రాష్ట్రాలతో అది సమానం. కేవలం ఓట్ల కోసమే ఆ దేశంతో పోలిక తెస్తున్నారు. పుల్వామా ఘటన కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. బయటి నుంచి పొంచి ఉండే ప్రమాదాలపై దేశం ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుంది. రక్షణ రంగంపై మనం ఎంతో ఖర్చు చేస్తున్నాం. ఇటువంటి పరిణామాల్లో ఎవరూ స్వప్రయోజనాలు ఆశించరాదు. చివరగా దేశమే ప్రయోజనం పొందాలి.
 
ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో రెండు చోట్లా విజయం సాధిస్తే మీరు ఎక్కడ ఉంటారు?
నేను చాలాసార్లు చెప్పాను. నాకు రాష్ట్రానికి సంబంధించి స్పష్టమైన ఎజెండా ఉంది. నదుల అనుసంధానం చేయాలి. పోలవరం, అమరావతి పూర్తి చేయాలి. కొత్త రాష్ట్రానికి ఒక రూపు దిద్దాలి. అలాగే.. కేంద్రంలో సీనియర్‌ నాయకులతో కలిసి పనిచేస్తాను. జాతి నిర్మాణంలో నా వంతు పాత్రను పోషిస్తాను. ఈ దేశానికి మంచి నాయకత్వం కావాలి. వచ్చే సంకీర్ణ ప్రభుత్వం ఆ నాయకత్వాన్ని ఇస్తుంది.
 
కియ మోటార్స్‌ వంటివి తప్ప రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు వచ్చినట్లు కనిపించడం లేదు.
గత ఐదే ళ్లలో దేశంలో పరిస్థితులేం బాగోలేవు. అయినా, మా ప్రయత్నం కొనసాగుతోంది. విశాఖపట్నం ఫిన్‌టెక్‌కు కేంద్రంగా మారుతోంది. డేటా వేర్‌ హౌసింగ్‌ కూడా అక్కడ నిలదొక్కుకోబోతోంది. అదానీ గ్రూప్‌ రూ. 76 వేల కోట్లతో అక్కడ డేటా సెంటర్‌ను పెడుతోంది. హార్డ్‌వేర్‌ పరిశ్రమలు కూడా రాబోతున్నాయి.
 
ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?
వెయ్యి శాతం మేమే గెలుస్తున్నాం. మాకు ఎటువంటి అనుమానం లేదు. ఒకే సమస్య… ఈవీఎంలది. దేశవ్యాప్తంగా ఈవీఎంలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సక్రమంగా పని చేయడం లేదు. మానిప్యులేట్‌ అయ్యాయన్న ఆరోపణలూ వస్తున్నాయి. అందుకే వాటిపై నేను పోరాటం చేస్తున్నాను. ఇది నా కోసం కాదు. జాతీయ ప్రయోజనం కోసం.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *