సంకీర్ణానికి అగ్ని పరీక్ష.. బీజేపీకి అదృష్ట పరీక్ష


బెంగళూరు: రాష్ట్రంలోని ధార్వాడ జిల్లా కుందగోళ, గుల్బర్గా జిల్లాలోని చించోళి శాసనసభ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు అధికార కాంగ్రెస్‌, జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వానికి అగ్ని పరీక్ష కానుండగా ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీకి అదృష్ట పరీక్ష కానుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధీనంలో ఉన్న ఈ రెండు నియోజకవర్గాలను చేజిక్కించుకోవడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రత్యేకించి ఈ రెండు నియోజకవర్గాలపై పట్టు కోసం స్వయంగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప రంగంలోకి దిగారు.
 
ఈ రెండు నియోజకవర్గాలు గెలిస్తే శాసనసభలో బీజేపీ బలం 104 నుంచి 106కు పెరుగుతుంది. తద్వారా ఆపరేషన్‌ కమలతో కాం గ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకోవాలని కమలనాథులు ప్లాన్‌ వేస్తున్నారు. అవసరమైతే ప్రచారానికి జాతీయ స్థాయి నేతలను కూడా రప్పించే సన్నాహాల్లో ఉన్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో బహిరంగ సభను నిర్వహించాలని తలపోస్తున్నారు. మే 19న ఈ రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉన్న అమిత్‌ షా రెండు గం టల సమయాన్ని మాత్రమే ఉప ఎన్నికల కోసం కేటాయించేందుకు సంసిద్దతను వ్యక్తం చేసినట్లు తెలిసింది. లింగాయత్‌ల ప్రాబల్యం అఽ దికంగా ఉండడంతో కుందగోళలో బీజేపీ ఈ వర్గానికి చెందిన నేతలందరినీ రం గంలోకి దింపింది.
 
అలాగే బలహీన వర్గాలు, దళితులు అధికంగా ఉన్న చించోళిలో ఈ వర్గానికి చెందిన సీనియర్‌లను ప్రచారానికి పంపనుంది. కాగాకాంగ్రెస్‌ కూడా రెండు ఉప ఎన్నికలను గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగింది. ఈ రెండు నియోజకవర్గాలను కోల్పోతే రాజకీయంగా కాస్త ఇబ్బందికరమేనని అలాంటి పరిస్థితిని రానీయబోమని కేపీసీసీ అధ్యక్షులు దినేష్‌ గుండూరావ్‌ అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం సీనియర్‌ నేతలంతా ఖాళీగా ఉండడంతో వారిని ఈ రెండు నియోజక వర్గాల్లో ప్రచార బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరారు. మొత్తానికి రెండు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌, బీజేపీల మధ్యే హోరాహోరీ పోరు నెలకొనివుండడం తో సర్వత్రా ఉత్కంఠత నెలకొనివుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *