‘సంక్షేమా’నికి బంధనాలు


  • లబ్ధిదారులకు నగదు పంపిణీలో బ్యాంకర్ల నిర్లక్ష్యం
  • ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందని ‘పసుపు కుంకుమ’
  • నాలుగో విడత రుణమాఫీ జమకూ మోకాలడ్డు
  • వాతావరణ బీమా సొమ్ము పంట రుణాలకు సరి
  • ప్రభుత్వం కరుణించినా దయచూపని బ్యాంకులు
ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ఫలాలను సకాలంలో లబ్ధిదారులకు అందించకుండా బ్యాంకులు మొండిచేయి చూపుతున్నాయి. పథకాల లక్ష్యాన్ని దెబ్బతీయాలని కొందరు బ్యాంకర్లు, డిపాజిట్లు పెంచుకొనే ఉద్దేశంతో మరికొందరు బ్యాంకు అధికారులు కక్కుర్తి పడుతున్నారని విమర్శలొస్తున్నాయి.
 
అమరావతి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథకాల లబ్ధిదారులకు కొందరు బ్యాంకర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికీ పసుపు-కుంకుమ చెక్కులకు డబ్బులివ్వకుండా కొన్ని బ్యాంకులు సతాయిస్తున్నాయని డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. మూడు చెక్కులకూ కలిపి ఒకేసారి నగదు ఇస్తామని చెప్పిన బ్యాంకర్లు… పోలింగ్‌ అయిన తర్వాత కూడా తిప్పుకుంటున్నారని వాపోతున్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం మూడో విడత పసుపు కుంకుమ, యువనేస్తం, నాలుగో విడత రుణమాఫీ నిధులు విడుదల చేసింది. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను సకాలంలో అమలు చేయాలనే ఉద్దేశంతో ఏప్రిల్‌ 5లోపు జమచేసినా… వాటిని లబ్ధిదారులకు ఇవ్వడంలో బ్యాంకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. అటు పంటలకు వచ్చిన వాతావరణ బీమా మొత్తాన్ని పంట రుణాలకు జమ వేసుకున్నాయి. అనంతపురం జిల్లాకు వాతావరణ బీమా కింద మార్చిలోనే సుమారు రూ.550కోట్లు వచ్చాయి. గ్రామీణ బ్యాంకుల మేనేజర్లు వాటిని రైతులకు అందించకుండా పంట రుణాల ఖాతాలకు మళ్లించారు. జూలైలో రెన్యువల్‌ చేయాల్సిన రుణాలను ముందుగానే తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. వాతావరణ బీమా కింద కడప జిల్లాకు వచ్చిన రూ.250కోట్లు జమ చేయకుండా కొన్ని గ్రామీణ బ్యాంకులు మొండిచేయి చూపుతున్నాయని విమర్శలొస్తున్నాయి.
 
ప్రభుత్వానికి సహాయ నిరాకరణ ఉద్దేశంతోనే ఇద్దరు ఆర్‌ఎంలు కావాలని మహిళల చెక్కులకు డబ్బులివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలున్నాయి. రాయలసీమలో రెండు జిల్లాలకు చెందిన ఓ గ్రామీణ బ్యాంకు ఆర్‌ఎంలు పనిగట్టుకుని ఈ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ప్రభుత్వ ఫలాలు వెంటనే అందిస్తే… అధికార పార్టీకి లబ్ధి చేకూరుతుందనే దురుద్దేశంతోనే ఓ ప్రణాళిక ప్రకారం వీరు వ్యవహరిస్తున్నారని విమర్శలస్తున్నాయి. పసుపు కుంకుమ మొత్తాన్ని సుమారు రూ.5కోట్ల వరకూ పాత బాకీలకు జమ వేసుకున్నట్లు సమాచారం.
 
అనంతపురం జిల్లాలో లబ్ధిదారులకు డబ్బులివ్వకుండా ఎన్‌పీఏ ఖాతాలకు జమ చేయడంతో అక్కడ మహిళా సంఘాలు ధర్నాలు నిర్వహించడంతో పాటు బ్యాంకులకు తాళాలు వేసి నిరసన తెలిపారు. కల్యాణదుర్గం మండలంలో రుణమాఫీ నగదును ప్రభుత్వం ఎన్నికల ముందే పంపినా, అధికారులు వాటిని జమ చేయడంలో నిర్లక్ష్యం చేశారని విమర్శిస్తున్నారు.
 
అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పలు బ్యాంకులు పసుపు-కుంకుమ పథకం స్ఫూర్తిని దెబ్బతీశాయంటున్నారు. కొందరు బ్యాంకు అధికారులు ప్రభుత్వ వ్యతిరేక భావనతో సహాయ నిరాకరణ చేస్తే, మరికొందరు ఈ మొత్తంతో డిపాజిట్లు పెంచుకునేందుకు కక్కుర్తిపడ్డారని తెలుస్తోంది. పొదుపు మహిళలు బకాయిలున్నప్పటికీ ఈ డబ్బు మినహాయించుకోకూడదని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ తుంగలో తొక్కారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పొదుపు గ్రూపు సభ్యులకు పసుపు-కుంకుమ నిధులను 35రకాల బ్యాంకుల ద్వారా చెల్లిస్తున్నారు. ఈ నిధులను పంపిణీ చేసేందుకు ప్రతి బ్యాంకు నోడల్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. దీనిద్వారా సెర్ప్‌ అధికారులు ఆయా బ్రాంచిలకు అవసరమైన మొత్తాన్ని జమచేశారు. సెర్ప్‌ అధికారులు నిరంతరం మానిటర్‌ చేస్తున్నా పసుపు కుంకుమ ఫలాలు అన్నీ జిల్లాల్లో సకాలంలో అందలేదని ఆరోపణలొస్తున్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *