సంపద గోల్‌మాల్‌..!


విజయవాడ రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కింద వంద రోజులపాటు పని కల్పించాలన్న లక్ష్యం గ్రామాల్లో దెబ్బతింటోంది. ఈ పథకం పనులను పర్యవేక్షించే అధికారుల అవినీతి అక్రమాలను ప్రశ్నించిన వారికి నెలల తరబడి పనే చూపించడం లేదు. ‘ఉపాధి’ పథకం కింద సంపద సృష్టి కేంద్రాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. సంపద కేంద్రాల నిర్మాణానికి కూలీలు వెళ్లకుండానే వారి పేరుతో బిల్లులు సృష్టించి, కార్మికుల బ్యాంకు ఖాతాల్లో రోజుకు రూ.210 వేతనం జమ అవుతోంది. అలా జమైన మొత్తాన్ని డ్రా చేసి తమకు ఇవ్వాలంటూ కొన్ని చోట్ల పథకం పర్యవేక్షకులు ఒత్తిడి చేస్తున్నారు.
 
అసలు పని రాకుండా డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించిన వారికి మూడు నెలలుగా పని చూపించని ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది. విజయవాడ రూరల్‌ మండలం పాతపాడు గట్టు వద్ద రూ.5,24,537తో సంపద సృష్టి కేంద్రాన్ని గతేడాది ఆగస్టులో నిర్మించారు. దీని నిర్మాణ పనులకు 44 మంది ఉపాధి కూలీలు 265 రోజులపాటు పని చేసినట్లు రికార్డుల్లో చూపించారు. ఆ లెక్కన కూలీల బ్యాంకు ఖాతాలో రోజుకు రూ.210 చొప్పున రూ.55,650 జమైంది. ఆ డబ్బులను బ్యాంకులో నుంచి డ్రా చేసి తమకు ఇవ్వాలని పథకం పర్యవేక్షకులు కార్మికులను ఆదేశించారు. అప్పుడుగానీ, అసలేం జరిగిందో వారికి అర్థం కాలేదు. తామెవ్వరూ పనికి రాకుండా, తమకు వేతనాలు ఎలా మంజూరయ్యాయని, మస్తర్లు ఎవరు వేశారని, కనీసం తాము సంతకాలు చేయలేదని పలువురు కూలీలు అధికారులను ప్రశ్నించారు. కొన్ని పనులకు కూలీల అవసరం ఉండదని, సంతకం చేస్తే సరి పోతుందని, బ్యాంకు నుంచి డబ్బులు ఇవ్వాలని హుకుం జారీ చేసినట్లు కార్మికులు తెలిపారు. వాస్తవానికి సంపద కేంద్రం నిర్మాణ పనులు గతేడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు జరిగాయి. ఖాతాల్లో డబ్బులు రావటంతో కొందరు వాటిని డ్రా చేసి అధి కారులకు ఇవ్వగా, మరికొందరు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై పర్యవేక్షకుల తీరును కొందరు కార్మికులు తప్పుపట్టారు.
 
అడిగాననే పని లేదంటున్నారు
సంపద కేంద్రం నిర్మాణ పనులకు కూలీలు ఎవరూ రాలేదు. అలాంటపుడు కూలీల పేరుతో వేతనాలు ఎలా మంజూరయ్యాయి. ఇదే విషయాన్ని సంబంధిత పర్యవేక్షక అఽధికారిని ప్రశ్నించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు పని చూపించడం లేదు. చివరకు గ్రామంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు కూడా తెలియకుండా ఇతరులకు పని కల్పిస్తున్నారు. పాతపాడులో జనవరి నుంచి ఉపాధి పని చూపించడం లేదు.
-భూక్యా బాలాజీ
 
సంపద కేంద్రం పనితో సంబంధం లేదు
రాష్ట్రంలో సంపద కేంద్రాలన్నీ మెటీరియల్‌ కాంపోనెంట్‌ విధానంలో పనులు జరిగాయి. ఉపాధి కూలీలకు మస్తర్లు వేయిం చి ఆ వేతనాలు వచ్చాకే ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్‌కు ఇవ్వాల్సి ఉంది. కాంట్రాక్టర్‌, ఉపాధి కూలీల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాతే 44 మందికి వేతనాలు మంజూరు చేశాం. ఖాతాలో పడిన డబ్బులను కొందరు వెనక్కి ఇచ్చారు. చాలా మంది ఇవ్వలేదు. ఆ పనితో నాకు సంబంధం లేదు.
-శ్రీనివాస్‌, ఇన్‌చార్జి ఏపీవో

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *