సచివాలయ టవర్లు చకచకా


  • 35 అడుగుల ఎత్తులో కోర్‌ వాల్స్‌
  • నవీన పద్ధతుల్లో సెంట్రింగ్‌
  • డయాగ్రిడ్‌ స్టీల్‌ కాలమ్స్‌కు సన్నాహాలు
అమరావతి, మే 10 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఐకానిక్‌ భవనాలుగా నిలవనున్న సచివాలయ టవర్ల నిర్మాణం వేగం పుంజుకుంది. నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికుల్లో అత్యధికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో ఎన్నికల్లో ఓటేయడానికి సొంతూళ్లకు వెళ్లారు. దీంతో పనులు కొద్దివారాలపాటు నెమ్మదించాయి. అలా సొంతూళ్లకు వెళ్లిన కార్మికులు అమరావతికి తిరిగొస్తుండటంతో
నిర్మాణాలు పూర్వపు వేగం అందుకున్నాయి. వర్షాలు ప్రారంభమయ్యేనాటికి చుట్టూ నీరు చేరకుండా రిటైనింగ్‌ వాల్స్‌ను కట్టనున్నారు. ఇందుకోసం సాధ్యమైనంత ఎక్కువ పని చేయాలన్న లక్ష్యంతో కాంట్రాక్ట్‌ సంస్థలతో ఏపీసీఆర్డీయే వేగంగా పని చేయిస్తోంది. ఇప్పటికే టవర్‌-2కు సంబంధించిన రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం ప్రారంభమైంది. మిగిలిన 4 టవర్లకు చెందిన వాటిని కూడా త్వరలోనే మొదలు పెట్టేందుకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. మరొకపక్క.. బ్యాంకులు, రెస్టారెంట్లు, తపాలా కార్యాలయాల్లాంటి ప్రజా వసతుల కోసం నిర్మించనున్న ‘నాన్‌ కోర్‌ ఏరియా’ పనులూ వేగంగా జరుగుతున్నాయి.
 
నో కాలమ్స్‌.. బయట ఫ్రేమ్‌!
సుమారు రూ.3,500 కోట్ల అంచనా వ్యయంతో, 69లక్షల చ.అ. భారీ విస్తీర్ణంతో, 5టవర్లుగా శాశ్వత సెక్రటేరియట్‌ నిర్మాణం కానున్న సంగతి తెలిసిందే. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ సముదాయం విస్తీర్ణం 6లక్షల చదరపు అడుగులే. దీనినిబట్టి శాశ్వత సచివాలయం ఎంతటి భారీదో ఊహించుకోవచ్చు. వచ్చే ఏడాది అక్టోబరుకల్లా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సెక్రటేరియట్‌ టవర్లలో సచివాలయంతోపాటు సుమారు 145 విభాగాధిపతుల కార్యాలయాలుంటాయి. దేశంలో ఇదే మొదటిది. మొత్తం ఐదు టవర్లలో సీఎం, సీఎస్‌ ఉంటే జీఏడీ టవర్‌ 50 అంతస్తులతో, మిగతా నాలుగూ 40 టవర్లతో ఉంటాయి. పైన హెలిప్యాడ్‌ ఉండే జీఏడీ టవర్‌ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన (225 మీటర్లు) సచివాలయ భవనంగా నిలవబోతోంది. బిల్టప్‌ ఏరియా విస్తీర్ణం 56లక్షల చ.అ. కాగా, 13లక్షల చ.అ.లను పార్కింగ్‌కు నిర్దేశించారు. ఇక్కడ 4,500 కార్లు నిలపుకొనే వీలుంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపించే ట్విన్‌ లిఫ్ట్‌లు, అత్యంత సౌకర్యవంతమైన ఆఫీస్‌ స్పేస్‌లు, సందర్శకులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఈ టవర్లలో ఉంటాయి. డయాగ్రిడ్‌ స్ట్రక్చరల్‌ విధానంలో టవర్లు నిర్మిస్తారు. మధ్యలో కాలమ్స్‌ లేకుండా, బాహ్యభాగంలో వచ్చే ఫ్రేమ్‌ ఆధారంగా నిర్మితమవుతాయి. స్థలాన్ని ఆదా చేయడంతోపాటు, ఎటువంటి అడ్డంకుల్లేని, ఎలాగైనా వాడుకునే వీలు కల్పించే డయాగ్రిడ్‌ విధానాన్ని ఒక కార్యాలయ భవనాల సముదాయానికి వినియోగిస్తుండటం దేశంలో ఇదే మొదటిసారి. భూకంపాలు, పెనుగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్ధంగా తట్టుకుని నిలవడమే కాకుండా అగ్ని ప్రమాదాల్లాంటివి సంభవించినప్పుడు ప్రాణనష్టాన్ని దాదాపుగా నివారించేలా డిజైన్‌ చేశారు.
 
3 విధానాల్లో సెంట్రింగ్‌!
ఆకాశాన్ని చుంబిస్తున్నాయా అనిపించేలా అత్యంత ఎత్తుతో నిర్మితమయ్యే ఈ టవర్లకు అంతే భారీస్థాయిలో, అధునాతన ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ వేసే పనిని కొద్ది నెలల క్రితమే కాంట్రాక్ట్‌ కంపెనీలు పూర్తి చేశాయి. భూమట్టానికి దిగువన ఉండే ఈ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌కు మధ్య భాగాన, లిఫ్ట్‌-మెట్లు తదితర కామన్‌ వసతులుండే కోర్‌ వాల్స్‌ నిర్మాణం వేగంగా సాగుతోంది. కోర్‌ వాల్స్‌కు, ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌కు మధ్యన ఉండే ప్రదేశంలో ఆఫీస్‌ స్పేస్‌లు వస్తాయి. బేస్‌మెంట్‌ నుంచి సుమారు 35 అడుగుల ఎత్తువరకు జరిపే కోర్‌ వాల్స్‌ నిర్మాణం ఇంచుమించుగా తుదిదశల్లో ఉంది. అది పూర్తవగానే కోర్‌ వాల్స్‌పై 3 అధునాతన సెంట్రింగ్‌ విధానాలను అనుసరించి పైఅంతస్తులు నిర్మాణానికి సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. 1, 2 టవర్లను నిర్మిస్తున్న షాపూర్జీ పల్లోంజీ సంస్థ ‘డోకా జంపింగ్‌ షట్టరింగ్‌’ విధానాన్ని పాటిస్తుండగా, 3, 4 టవర్లను నిర్మిస్తున్న ఎల్‌అండ్‌టీ తాను స్వయంగా అభివృద్ధి చేసుకుని ఇప్పటికే కొన్నిచోట్ల విజయవంతంగా అమలు జరిపిన ‘ఆటోమేటిక్‌ క్లైంబింగ్‌ సిస్టం (ఏసీఎస్‌)’ విధానాన్ని, 5వ టవర్‌ నిర్మిస్తున్న ఎన్‌సీసీ ‘పెరి (జర్మన్‌ సంస్థ) ఆవిష్కరించిన సెంట్రింగ్‌’ విధానాన్ని పాటిస్తున్నాయి. వీటికి అవసరమైన సెంట్రింగ్‌ వ్యవస్థల వ్యయం ఒక్కోదానికీ రూ.8కోట్ల నుంచి రూ.10కోట్ల మధ్య ఉంటుంది. 3 అంతస్తుల ఎత్తుండే ఈ వ్యవస్థల ద్వారా ఒక్కొక్క అంతస్తు (సాంకేతిక పరిభాషలో సైకిల్‌గా అభివర్ణిస్తారు)కు సెంట్రింగ్‌ వేసేందుకు 6 నుంచి 10 రోజులు పడుతుంది. అంటే 40 అంతస్తులుండే 4 టవర్ల కోర్‌ వాల్స్‌ పూర్తయ్యేందుకు అత్యధికంగా 400 రోజులు, 50 అంతస్థుల జీఏడీ టవర్‌కు అత్యధికంగా 500 రోజులు పట్టే అవకాశముంది. దీంతో సాధ్యమైనంత తక్కువ వ్యవధిలోనే సెంట్రింగ్‌ పనులను పూర్తి చేసేందుకు సీఆర్డీయే అధికారులు, నిపుణులు ప్రయత్నిస్తున్నారు.
 
వేగంగా డయాగ్రిడ్‌ స్టీల్‌ కాలమ్స్‌
కోర్‌ వాల్‌ చుట్టూరా ఉండే ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ వేదికగా డయాగ్రిడ్‌ స్టీల్‌ కాలమ్స్‌ ఏర్పాటు చేసే పని కూడా వేగంగా సాగుతోంది. 15 నుంచి 18 టన్నుల బరువుండే ఈ భారీ కాలమ్స్‌ తయారీని భారత్‌కు చెందిన జేఎ్‌సడబ్ల్యూ సంస్థ, గల్ఫ్‌కు చెందిన ఎవర్‌ సెండాయ్‌ కంపెనీ చేపట్టాయి. 1, 2, 3, 4 టవర్లలో ఒక్కొక్కదానిలో అమర్చే కాలమ్స్‌లో వినియోగించే అత్యంత పటిష్ఠమై ఈ350బీఆర్‌ రకం స్టీల్‌ బరువు 10,000 టన్నుల నుంచి 12,000 టన్నుల వరకు, 50 అంతస్తులుండే 5వ టవర్‌లో 15,000 టన్నుల వరకు ఉండనుంది. 1, 2 టవర్లకు అవసరమైన స్టీల్‌ కాలమ్స్‌ను జేఎ్‌సడబ్ల్యూ బళ్లారిలో ఉన్న తమ కర్మాగారంలో తయారు చేసి, అమరావతికి చేర్చుతోంది. ఈ సంస్థలు స్టీల్‌ కాలమ్స్‌తోపాటు డయాగ్రిడ్‌ వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన ఇతర స్టీల్‌ ఉత్పత్తులను కూడా రూపొందిస్తున్నాయి. కాగా, టవర్ల నిర్మాణం పూర్తి ప్రణాళికాబద్ధంగా, లోపరహితంగా, సంపూర్ణ నాణ్యతా ప్రమాణాలతో జరిగేలా చూసేందుకు సీఆర్డీయే ఇంజినీర్లు, ఉన్నతాధికారులు ప్రతినిత్యం ప్రాజెక్ట్‌ సైట్‌లోనే నిపుణులతో వర్క్‌ షాపులు నిర్వహిస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *