సన్‌డే


  • 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • 19 మండలాల్లో ఇదే పరిస్థితి
  • రాత్రి ఎనిమిది గంటల వరకు వడగాడ్పులు
  • నేడూ ఎండ ప్రచండమే
విజయవాడ (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాలు కూడా ఎక్కువవుతున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ముఖ్యంగా విజయవాడకు గేట్‌వే గా ఉన్న ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు. ఈ రెండు ప్రాంతాల్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నమోదవ్వడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ వేసవిలో రోహిణికార్తె రాకముందే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయవాడతోపాటు జిల్లాలోని ప్రాం తాల్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. జిల్లాలో జగ్గయ్యపేటతో పాటు 18 ప్రాంతాల్లో 45 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయవాడ, ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లి, గన్నవరం, జి.కొండూరు, ఎ.కొండూరు, బాపులపాడు, ముసునూరు, ఇబ్రహీంపట్నం, కొండపల్లి, రెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 46 డిగ్రీలను తాకింది. శనివారం విజయవాడలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం ఏకంగా మరో రెండు డిగ్రీలకు పెరగడంతో జిల్లా వాసులు అల్లాడిపోయారు. నగరంలో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడ్డారు. ఉదయం తొమ్మిది గంటల సమయానికే వడగాడ్పులు ప్రారంభమయ్యాయి.
 
సాయంత్రం ఏడు గంటలకు కూడా ఏడు మండలాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలుగా కనిపించింది. ఈనెల 25 నుంచి రోహిణికార్తె ప్రారంభం కానుంది. ఇంకా 20 రోజుల సమయం ఉండగానే ఎండలు మండిపోవడంతో ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. ఉష్ణోగ్రతలు వరుసగా పెరుగుతుండడంతో ఇళ్లలో ఏసీలకు జనం విరామం ఇవ్వడం లేదు. మరోపక్క జిల్లావ్యాప్తంగా విద్యుత్‌ వినియోగం కూడా భారీగానే పెరిగింది. పచ్చదనాన్ని పెంచుకోగలిగితే నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలను తగ్గించుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఉత్తరాది నుంచి వేడి గాలులు ముందుకు నగరాన్ని తాకడం వేడికి ఒక కారణమైతే, పెరుగుతున్న కాలుష్యం మరో కారణమని తెలుస్తోంది. నగరంలో వాహనాల సంఖ్య భారీగా పెరగడం, జాతీయరహదారి నగరం మధ్య నుంచే వెళ్తుండడంతో ఆ వాహనాల ద్వారా విడుదలయ్యే సీవో2 (కార్బన్‌ డైయాక్సైడ్‌) రోజురోజుకు పెరుగుతోంది. దీన్ని తగ్గించగలిగితే నగరంలో వేడిని తగ్గించవచ్చని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు ఆదివారం 45 డిగ్రీలను తాకగా, సోమవారం కూడా పరిస్థితి ఈవిధంగానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *