సమరమే


  • మండిపోయిన బెజవాడ
  • నగరంలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • గుడివాడ, జగ్గయ్యపేట, వత్సవాయిల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత
  • కైకలూరు, కృత్తివెన్నులో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • నేడూ ఇదే పరిస్థితి
విజయవాడ, మే 4(ఆంధ్రజ్యోతి): శాస్త్రవేత్తలు చెప్పిందే జరుగుతోంది. అంచ నాలే అసలు అంకెలను చూపిస్తున్నాయి. వేసవిలో భగభగలాడే బెజవాడ ఈసారి మరింత మండిపోతుందని నిపుణులు చెప్పిన మాటలు ఇప్పుడు వాస్తవాలవుతు న్నాయి. దీనికి నిదర్శనమే విజయవాడలో గడచిన రెండు రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. రోహిణికార్తికి ముందే బెజవాడలో ఎండలు మండిపోతాయని మార్చి నెలలోనే శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. రెండు రోజుల్లో విజయవాడలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం 41.9 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోద వ్వగా, శనివారం 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం జిల్లాలో పలు చోట్ల ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటగా, గుడివాడ, జగ్గయ్యపేట, వత్సవాయిల్లో ఒక్కసారిగా 44 డిగ్రీలకు, కైకలూరు, కృత్తివెన్నుల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
 
ఏటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజ లను కలవరపెడుతున్నాయి. గడచిన నాలుగేళ్లకు మించి ఎండలు కాస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాధారణంగా ఏప్రిల్‌ 22వ తేదీ నుంచి మాత్రమే విజయవాడలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలను దాటుకుంటూ వెళ్తాయి. అటు వంటిది ఈ ఏడాది మార్చి నెలాఖరు నుంచి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలను దాటడడం కనిపించింది. ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే అంశమని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. శనివారం సాయంత్రం ఎనిమిది గంటలకు పెద్దఅవుటపల్లి వద్ద 35.82 డిగ్రీల ఉష్ణోగ్రత చూపించింది. బంగాళాఖాతంలో అల్పపీడనద్రోణి ఏర్పడిన తర్వాత జిల్లాలో వాతావరణం చల్లబడింది. ఫణి తుఫాన్‌ ప్రభావం లేకపోయినప్పటికీ చల్లదనాన్ని ఆస్వాదించామన్న సంతోషంలో ప్రజలు ఉన్నారు. తాజాగా కాస్తున్న ఎండలు ప్రజలను బయటకు రానివ్వకుండా చేస్తున్నాయి. సాయంత్రం పూట కృష్ణా నదీ తీరంలో గడపడానికి వెళ్లే ప్రకృతి ప్రేమికులు దానికి విరామం ప్రకటించుకున్నారు.
 
నేడూ ఇదే పరిస్థితి
జిల్లాలో విజయవాడతో పాటు పలు మండలాల్లో దానికి దగ్గర ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మరో రెండు రోజులపాటు జిల్లా మొత్తంగా ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ సుమారుగా ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటాయని నిపుణులు వివరించారు. సోమవారమూ ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేశారు.
 
ముఖ్యంగా గుడివాడ, నందివాడ, పెదపారుపూడి, బాపులపాడు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఆర్టీజీఎస్‌ (రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌) వెల్లడించింది. ఈ ఉష్ణోగ్రతలకు చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండడమే మేలని వైద్యులు సూచిస్తున్నారు. శనివారం రాత్రికి ఒక మండలంలో 40-45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా, 47 ప్రాంతాల్లో 35-40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
 
అందుకేనా ఇలా…
వేసవిలో పవనాలు ఉత్తరాది నుంచి దక్షిణాదికి వీస్తాయి. ముఖ్యంగా రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతం నుంచి తెలుగు రాష్ట్రాల్లో వేసవిలో పవనాలు వీస్తాయి. ఈ పవనాలు ప్రతి ఏడాది మే 22, 23 తేదీల నుంచి ఇటు వైపునకు రావడం మొదలుపెడతాయి. అటువంటిది ఈ ఏడాది చాలా ముందుగా పవనాలు ఉత్తరాది వైపు నుంచి వస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పైగా దీనిపై ఫణి తుఫాన్‌ ప్రభావం పడిందని చెబుతున్నారు. ఈ కారణంగానే వేడి గాలులు విపరీతంగా వీయడంతోపాటు ఉష్ణోగ్రతలు 44, 45 డిగ్రీల స్థాయిలో నమోదవుతున్నాయని తేల్చారు. 2016 మేలో విజయవాడలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ ఏడాది ఎండలు ఆ స్థాయిని దాటిపోవచ్చని కేఎల్‌ వర్సిటీ వాతావరణ శాఖ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సత్యనారాయణ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *