సమీక్షకు వేళాయె


  • రేపటి నుంచి బాబు పోల్‌ రివ్యూలు
  • పోలింగ్‌ సరళిపై చర్చలు.. రోజుకు 14 అసెంబ్లీ సీట్ల నేతలతో భేటీలు
  • ఒక్కో అసెంబ్లీ స్థానం నుంచి 50 మందికి పిలుపు.. ప్రతి రోజూ 2 లోక్‌సభ సీట్ల పరిధిలో చర్చ
  • 8, 9 తేదీల్లో బెంగాల్లో సీఎం ప్రచారం!
అమరావతి, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ సరళిపై తెలుగుదేశం పార్టీ సమీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. రోజుకు రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో సమీక్ష జరపాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 50 మంది పార్టీ నేతలను ఆహ్వానిస్తున్నారు. నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, ఏరియా కోఆర్డినేటర్లు, ఇతర ముఖ్య నేతలు ఈ జాబితాలో ఉన్నారు. రోజుకు 14 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమావేశమవుతారు. ఈసారి ఈ సమీక్షలను విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై మంగళగిరి వద్ద ఉన్న హ్యాపీ రిసార్ట్స్‌లో జరుపుతున్నారు. ముఖ్యమంత్రి నివాసం వద్ద సమావేశాల నిర్వహణకు ఎన్నికల కోడ్‌ ఆంక్షలు ఉండడంతో స్ధలం మార్చారు. ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై అప్రమత్తం చేసే నిమిత్తం ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
 
ప్రతి పోలింగ్‌ బూత్‌ వారీగా ఎన్ని ఓట్లు పడ్డాయో అధికారికంగా నిర్ధారించే 17-సీ సర్టిఫికెట్లను పోలింగ్‌ అధికారుల నుంచి సేకరించడం, ప్రతి బూత్‌ వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో విశ్లేషణ, ఎన్నికల్లో ఎవరెవరు పనిచేశారు… ఎవరెవరు చేయలేదో తెలియజేయాలని టీడీపీ అధిష్ఠానం నివేదికలు కోరింది. సమీక్షల సందర్భంగా వాటిపై చర్చించే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏజెంట్ల ఎంపిక, కౌంటింగ్‌ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, లెక్కింపులో తేడా వచ్చినప్పుడు ఏం చేయాలి.. తదితర అంశాలను పార్టీ అధినేత వారికి వివరిస్తారని సమాచారం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నేతలకు విడివిడి సమావేశాలు పెడతారు. వాటిలో చంద్రబాబు పాల్గొని వారితో మాట్లాడతారు. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ ఇవి జరుగుతాయి. తాత్కాలికంగా ఖరారు చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. రెండో తేదీన శ్రీకాకుళం, విజయనగరం లోక్‌సభ స్థానాలతో సమీక్షలు మొదలవుతాయి. 3న విశాఖపట్నం, అనకాపల్లి.. 4న అరకు, రాజమండ్రి, 6న కాకినాడ, అమలాపురం.. 7న తిరుపతి, చిత్తూరు.. 10న కర్నూలు, నంద్యాల.. మే 13న కడప, రాజంపేట.. 14న అనంతపురం, హిందూపురం.. 17న ఒంగోలు, నెల్లూరు.. 18న ఏలూరు, నరసాపురం.. 20న గుంటూరు, నరసరావుపేట.. 21న విజయవాడ, మచిలీపట్నం.. 22న బాపట్ల సీట్ల పరిధిలో సమీక్ష జరుగుతుంది. ఇది తాత్కాలిక షెడ్యూల్‌ మాత్రమేనని, 16వ తేదీ నాటికి సమీక్షలు పూర్తయ్యేలా దీనిని కుదించడంపై కసరత్తు జరిగే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ షెడ్యూల్‌లో 15 తేదీన పూర్తిగా సీబీఎన్‌ ఆర్మీ సభ్యులతో సమావేశానికి చంద్రబాబు సమయం కేటాయించారు. షెడ్యూల్‌ కుదించాల్సి వస్తే ఒక్కో రోజు మూడు లోక్‌సభ స్థానాల నేతలతో భేటీ అయ్యే అవకాశం లేకపోలేదు.
 
రెండు రోజులు బెంగాల్‌లో ప్రచారం
సమీక్షల మధ్యలో చంద్రబాబు రెండు రోజులు పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్తారు. 8, 9 తేదీల్లో వెళ్తారని సమాచారం. ఆ తేదీల్లో పార్టీ సమీక్షలు పెట్టలేదు. శని, ఆదివారాలు కావడంతో 4, 11, 12, 19 తేదీల్లో కూడా నిర్వహించడం లేదు. 16 తేదీనా విరామం ఇచ్చారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *