సమ్మెకు సిద్ధం


  • 46 డిమాండ్లు.. 22 వరకు గడువు
  • ఆర్టీసీ ఎండీకి ఎన్‌ఎంయూ నోటీసు
అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): ఏపీఎస్‌ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్‌ మోగింది. ప్రధాన కార్మిక సంఘం ఎన్‌ఎంయూ బుధవారం ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. తమ డిమాండ్లకు అంగీకరించకుంటే ఈ నెల 22 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళతామని హెచ్చరించింది. ఎన్‌ఎంయూ రాష్ట్ర నేతలు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు, డీఎస్పీ రావు బృందం 46 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును ఆర్టీసీ హౌస్‌ లో ఎండీ సురేంద్రబాబుకు అందజేసింది. కార్మికుల వేతన సవరణ బకాయిలు వెంటనే చెల్లించాలని, సిబ్బంది కుదింపు, గ్రాట్యుటీ తగ్గింపు, అద్దె బస్సుల పెంపు తదితర నిర్ణయాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. కార్మికులకు 2013 నుంచి చెల్లించాల్సిన రూ.650 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని హెచ్చరించింది. సమ్మె నోటీసును తీసుకున్న ఎండీ సురేంద్రబాబు ఈ అంశాలపై సంబంధిత ఈడీలతో చర్చించాలని సూచించినట్లు తెలిసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, నష్టాల నుంచి బయట పడేందుకు ఏటా కొత్త బస్సుల కొనుగోలుకు వెయ్యి కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలని, కార్మికుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలని, తన పరిధిలో లేవని ఎండీ చెప్పినట్టు తెలిసింది.
 
నేడు జేఏసీ సమ్మె నోటీసు…
మరోవైపు ఉగాది నుంచి చెల్లిస్తామన్న 2013 నాటి బకాయిల విడుదలలో జాప్యం, 3,500 మందికిపైగా సిబ్బంది కుదింపు, కొత్తగా 1200 అద్దె బస్సులు తీసుకోవాలన్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గుర్తింపు కార్మిక సంఘం ఈయూ సమ్మెకు దిగబోతోంది. కార్మిక పరిషత్‌, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ తదితర తొమ్మిది యూనియన్లతో కలిసి జేఏసీగా ఏర్పడింది. ఈయూ నేతృత్వంలోని జేఏసీ ఆర్టీసీ యాజమాన్యానికి గురువారం సమ్మె నోటీసు ఇవ్వబోతోంది. కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన యాజమాన్యం బకాయిలు చెల్లించకపోగా, సీసీఎస్‌ డబ్బులు కూడా వాడుకోవడాన్ని ఏ మాత్రం అంగీకరించబోమని జేఏసీ కన్వీనర్‌ పలిశెట్టి దామోదర్‌రావు అన్నారు. సామరస్యంగా సమస్య పరిష్కారానికి తాము ఎంత ప్రయత్నించినా సమ్మె చేయాల్సిన పరిస్థితులను యాజమాన్యం కల్పిస్తోందన్నారు. సంస్థను కాపాడుకొంటూనే కార్మికుల హక్కులు సాధించుకోవడానికి జేఏసీ పోరాడుతుందని చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *