సరిహద్దులు దాటేస్తున్నారు!


  • మకాం మార్చుతున్న బెట్టింగ్‌ రాయుళ్లు
  • కర్ణాటక కేంద్రంగా ఆపరేషన్‌!
  • నిఘా పెరగడంతో రూటు మార్చిన బుకీలు, సహాయకులు
  • సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసుల నిఘా
విజయవాడ ఆంధ్రజ్యోతి: ఓ వైపు ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల కాలం నడుస్తోంది. ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డౌన్‌ జరుగుతోంది. ఈ రెండు బెట్టింగ్‌ బాబులకు మంచి అవకాశాలు. ముఖ్యంగా బుకీలకు రెండు చేతులా నెల రోజులపాటు పనేపని. మెట్రో నగరాల నుంచి విస్తరించిన బెట్టింగ్‌ నెట్‌వర్క్‌ ఇప్పుడు విజయవాడ నుంచి మకాం మార్చుకుంటోంది. ఇక్కడ ఉండటం కంటే సేఫ్‌ జోన్‌కు చేరడమే మేలని భావించిన బుకీలు, వారి సహాయకులు రాష్ట్ర సరిహద్దులు దాటేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత విజయవాడ కాప్స్‌.. బెట్టింగ్‌లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. పోలీసు రికార్డుల్లో ఉన్న పాత బుకీల జాతకాలను సాంకేతిక పరిజ్ఞానంతో తిరగతోడుతున్నారు. ఈ సమయంలో పోలీసులకు కొత్త విషయం బోధపడింది. ఒకపక్క వారి కోసం ప్రత్యేక బృందాలు తిరుగుతున్నా ఇళ్లలో ఉండటం లేదన్న సమాధానం వస్తోంది. అసలు వారు ఎక్కడికి వెళ్తున్నారా అని కూపీ లాగినప్పుడు అసలు విషయం తెలిసింది. ప్రధాన బుకీల సహాయకులు, వారికి పద్దులు, లెక్కలు రాసే ఉద్యోగులు ఇప్పుడు విజయవాడ నుంచి కర్ణాటక రాష్ట్రానికి దుకాణం మార్చేశారు. వన్‌టౌన్‌, సత్యనారాయణపురం, మధురానగర్‌, అజిత్‌సింగ్‌ నగర్‌, కేదారేశ్వరిపేట ప్రాంతాల్లో బెట్టింగ్‌ ముఠాలతో కొందరు యువకులకు సంబంధం ఉంది. వీళ్లంతా ఒక గ్యాంగ్‌గా ఏర్పడి పరిచయం ఉన్న వాళ్లను బెట్టింగ్‌కు పంపుతున్నారు. ఓడిన వారి నుంచి డబ్బు వసూలు చేసి గెలిచిన వాళ్లకు అందజేసే బాధ్యత ఈ గ్యాంగ్‌లదే. గడచిన ఏడాది విజయవాడ పోలీసులు భారీ బెట్టింగ్‌ ముఠాను అరెస్టు చేశారు. ఇందులో జిల్లాలో ప్రధాన బుకీలుగా వ్యవహరిస్తున్న వారు విదేశాలకు పారిపోయారు. అప్పటి నుంచి వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
 
ప్రత్యేక నిఘా
తాజాగా ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతుండటం, మరోపక్క ఓట్ల లెక్కింపునకు రోజులు సమీపిస్తుండటంతో బెట్టింగ్‌లు జోరుగా జరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 24/7 నిఘా కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో కొంతమంది బుకీల సహాయకుల ఫోన్‌ నంబర్లు కర్ణాటక రాష్ట్రంలో బీదర్‌, బెంగళూరు ప్రాంతాల్లో ఉన్నట్టు మ్యాప్‌లు చూపిస్తున్నాయి. ఇక్కడ నిఘా బలంగా ఉండటంతో వాళ్లంతా సరిహద్దులు దాటేశారని పోలీసులు భావిస్తున్నారు. మరికొంతమంది బెంగళూరులో ఉండే ప్రధాన బుకీల వద్ద సహాయకులుగా చేరిపోయారని గుర్తించారు. ల్యాప్‌టాప్‌లు, ఇతర సాంకేతిక పరికరాలతో పోలీసులు ప్రత్యేకంగా పోలీసులు ఇదే పనిపై ఉన్నారు. గడచిన కొద్దికాలంగా విజయవాడ పోలీసులు ప్రధాన బుకీలపై కన్నేశారు. ఇప్పటి వరకు ద్వితీయ, తృతీయ శ్రేణి పందెంగాళ్లను మాత్రమే పోలీసులు అరెస్టు చేశారు. ఈసారి బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నందుకు ప్రధాన బుకీలను లక్ష్యంగా చేసుకుని కాప్స్‌ అడుగులు పడుతున్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *