సహనం ముఖ్యం!


  • టెంపర్‌ కోల్పోతే ఉద్యోగం ఊస్ట్‌
  • దేశ సమగ్రత, రాజ్యాంగ పరిరక్షణే అంతిమలక్ష్యం
  • సివిల్‌ సర్వీసెస్‌ దినోత్సవ వేడుకల్లో సీఎస్‌
అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): సమాజ సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల ఆశయాలకు అనుగుణంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు, లక్ష్యాల సాధనలో అఖిల భారత సర్వీస్‌ అధికారులు చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం సచివాలయంలో ఏపీ హెచ్‌ఆర్డీ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో జరిగిన 13వ సివిల్‌ సర్వీసెస్‌ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎలాంటి సమయంలోనూ సహనం కోల్పోకూడదన్నారు. సివిల్‌ సర్వీసె్‌సలో అవతలి వాళ్లు రెచ్చగొట్టారు కదా అని టెంపర్‌ కోల్పోయి ప్రతి వ్యాఖ్యలు చేయడం వల్ల ఉద్యోగం కోల్పోయిన అధికారులు తనకు తెలుసన్నారు. సివిల్‌ సర్వీసు అధికారుల జీవితం క్రికెట్‌ మ్యాచ్‌ లాంటిదని, ఒక్క బంతి సరిగ్గా ఆడకపోయినా ఔట్‌ అవ్వాల్సిందేనన్నారు. అదే బ్యాడ్మింటన్‌లో అయితే మరోసారి సర్వీస్‌ చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రధాన కార్యదర్శిగా మిగిలిన అధికారులకు రోల్‌ మోడల్‌గా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని, నిజాయతీగా, హుందాగా ఉండటం తన బాధ్యత అన్నారు.
 
సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు ప్రభుత్వ పాలసీలను డీల్‌ చేయాల్సి వచ్చినప్పుడు అది వ్యక్తిగత లాభం కోసమా? సమాజ ప్రయోజనం కోసమా అని గుర్తించగలగాలన్నారు. సివిల్‌ సర్వీసు అధికారుల అంతిమ లక్ష్యం మానవత్వం, దేశ సమగ్రత, రాజ్యాంగ పరిరక్షణే కావాలన్నారు. వివిధ పథకాలు, పాలసీల అమలులో నిబద్ధతతో పని చేసి మెరుగైన లక్ష్యాల సాధనలో కీలకపాత్ర పోషించాల్సిన ఆవశ్యకత సివిల్‌ సర్వీసు అధికారులపై ఉందని సీఎస్‌ పేర్కొన్నారు. ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డి.చక్రపాణి మాట్లాడుతూ… హెచ్‌ఆర్డీ సంస్థల అందిస్తున్న వివిధ రకాల శిక్షణా కార్యక్రమాలను వివరించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *