సిన్హా వ్యాఖ్యలపై చిదంబరం ఏమన్నారంటే…


ముంబై: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా పాత్రను ప్రశంసిస్తూ శత్రుఘ్నసిన్హా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఆచితూచి స్పందించారు. దీనిపై శత్రుఘ్నసిన్హానే వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
 
సిన్హా చేసిన వ్యాఖ్యలపై శనివారంనాడు మీడియా అడిగిన ప్రశ్నకు చిదంబరం స్పందిస్తూ, సిన్హా ఏమన్నారో, దానిపై ఆయన అభిప్రాయం ఏమిటో చెప్పాల్సింది కూడా ఆయనేనని అన్నారు. ‘కొద్ది రోజుల క్రితం వరకూ ఆయన బీజేపీతోనే ఉన్నారు. మరి ఇన్నేళ్లుగా ఆయన బీజేపీలో ఎలా కొనసాగారో ఆ పార్టీనే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క సభ్యుడి (కాంగ్రెస్) వ్యాఖ్యలపై నేను స్పందించాల్సిన పని లేదు. పార్టీ అధికార నిర్ణయాలపై మాత్రమే నేను మాట్లాడతాను’ అని చిదంబరం పేర్కొన్నారు.
 
దేశ స్వాంతత్ర్య సాధన, అభివృద్ధిలో గాంధీ, సర్దార్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ, జిన్నా చేసిన సేవలు ప్రశంసనీయమని సిన్హా శుక్రవారనాడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. జిన్నాను సిన్హా ప్రశంసించడం రాజకీయ వర్గాల్లో విమర్శలకు తావిచ్చింది. దీనిపై శత్రుఘ్నసిన్హా శనివారం వివరణ ఇచ్చారు. ఒకటి చెప్పబోయి మరొకటి చెప్పానని, నోరు జారిందని తెలిపారు. మౌలానా ఆజాద్ పేరు చెప్పబోయి పొరపాటున మహమ్మద్ అలీ జిన్నా పేరు చెప్పినట్టు ఆయన వివరణ ఇచ్చారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన సిన్హా …. పాట్నాసాహిబ్  లోక్‌సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *