సీఎం మమత కారు దిగిరావడంతో బీజేపీ కార్యకర్తలు పరుగో పరుగు!


న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీకి నిన్న సాయంత్రం ఊహించని అనుభవం ఎదురైంది. వెస్ట్ మిడ్నాపూర్‌లో కొందరు ఆమెను చూసి ‘‘జై శ్రీరాం’’ అంటూ నినాదాలు చేయడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మధ్యాహ్నం మమత ఓ బహిరంగ సభలో ప్రసంగించేందుకు చంద్రకొండ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. బీజేపీ జెండాలు పట్టుకుని రోడ్డుకిరువైపులా నిలబడిన కొందరు గ్రామస్తులు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని చూడగానే ‘‘జై శ్రీరాం’’ అంటూ నినాదాలు చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మమత వెంటనే తన డ్రైవర్‌ను కారు ఆపమని చెప్పి ఒక్కసారిగా డోర్ తీసి కిందికి దిగారు. అంతే.. బీజేపీ కార్యకర్తలు ఆమెను చూసి పరుగు లంకించుకున్నారు. దీంతో మమత వారిని చూసి ‘‘ఎందుకు పారిపోతున్నారు. ఇలా రండి…’’ అని పిలిచారు. వాళ్లంతా చాలా తెలివిగా తప్పించుకుంటున్నారంటూ పేర్కొన్న మమత అనంతరం అక్కడి నుంచి సభాస్థలికి బయల్దేరి వెళ్లారు.
 
అనంతరం ఆమె చంద్రకొండలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. ‘‘నినాదాలు చేస్తున్న వాళ్లంతా మే 23 ఎన్నికల ఫలితాలు చూసి బాధపడాల్సి వస్తుంది. ఎన్నికల తర్వాత కూడా వారు ఈ రాష్ట్రంలోనే ఉంటారని గుర్తుంచుకోవాలి…’’ అని పేర్కొన్నారు. బెంగాల్లో విభజన రాజకీయాలు చేస్తూ, ఘర్షణలు ప్రేరేపించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని బెనర్జీ ఆరోపించారు. కాగా వెస్ట్ మిడ్నాపూర్ ఘటపై బీజేపీ స్పందిస్తూ.. ‘‘జై శ్రీరాం నినాదాలు వినగానే మమతకు ఎందుకంత కోపమొస్తోంది. అదేదో వినకూడని మాట అన్నట్టు ఎందుకు అడుతున్నారు?’’ అంటూ ట్వీట్ చేసింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *