సీజనల్‌ వ్యాధుల అదుపునకు స్పెషల్‌ డ్రైవ్‌


  • పూనం మాలకొండయ్య
విశాఖపట్నం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు విజృంభించకుండా ఈనెల 15వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. గురువారం విశాఖపట్నం కలెక్టరేట్‌లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికారులతో ఆమె సీజనల్‌ వ్యాధులపై సమీక్ష జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ…గత ఏడాది ఏజెన్సీతోపాటు, అర్బన్‌ ప్రాంతాల్లో సీజనల్‌ వ్యాధులు విజృంభించాయని, ఈఏడాది ముందస్తు చర్యలు చేపట్టామని, అప్పటితో పోల్చుకుంటే వ్యాధులు 60 శాతం తగ్గుముఖం పట్టాయన్నారు. మలేరియా అదుపునకు పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో గతేడాది గిరిజనులకు దాదాపు 24 లక్షల దోమతెరలు అందజేశామని, ఈ ఏడాది అదనంగా మరో 11 లక్షల దోమతెరలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
 
ఏజెన్సీలో ఖాళీగా ఉన్న వైద్యాధికారుల పోస్టులు త్వరలోనే భర్తీ అవుతాయన్నారు. ఏజెన్సీలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 24 గంటల ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్‌ చేసి సేవలు అందిస్తున్నామని తెలిపారు. పాడేరు, పార్వతీపురం పీహెచ్‌సీలను జిల్లా అసుపత్రులుగా అప్‌గ్రేడ్‌ చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. మాతా, శిశు మరణాలు అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో 2,168 అదనపు పౌష్టికాహార కేంద్రాలు అందుబాటులోకి తెచ్చి, 23,280 మందికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌, జిల్లా కలెక్టర్‌ కె.భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *