సీజేఐ రంజన్ గొగోయ్‌కి అరుణ్ జైట్లీ బాసట


న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బాసటగా నిలిచారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జస్టిస్ గొగోయ్‌ని గట్టిగా సమర్థిస్తూ జైట్లీ ఓ వ్యాసం రాశారు. వామపక్ష, అతివాద వామపక్ష భావజాలంగలవారు బార్‌లోని ఓ వర్గంతో కలిసి మునుపెన్నడూ లేని విధంగా న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ దాడికి పాల్పడేవారిని వ్యవస్థా విధ్వంసకులుగా అభివర్ణించారు. సీజేఐపై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఈ బ్లాగ్ పోస్ట్‌ను జైట్లీ రాశారు.
 
ఫిర్యాదుదారు తన ఫిర్యాదును సుప్రీంకోర్టులోని ఇతర న్యాయమూర్తులకు, మీడియాకు పంపిణీ చేయడం ఈ కేసును సంచలనాత్మకం చేయడానికేనని జైట్లీ ఆరోపించారు. కొన్ని డిజిటల్ మీడియా సంస్థలు ఒకే విధమైన ప్రశ్నావళిని సీజేఐకి సంధించాయని, వీటికి వ్యవస్థా విధ్వంసంలో సాటిలేని ట్రాక్ రికార్డ్ ఉందని, దీనినిబట్టి మన కంటికి కనిపిస్తున్నదాని కన్నా వేరే ఏదో ఉన్నట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తికి, న్యాయ వ్యవస్థలకు విశ్వసనీయత, గౌరవం ముఖ్యమని, ఒకసారి మంచి పేరు నాశనమైందంటే, యావత్తు వ్యవస్థ కుప్పకూలిపోతుందని హెచ్చరించారు.
 
ప్రస్తుత సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్‌ అత్యంత గౌరవప్రదులని జైట్లీ పేర్కొన్నారు. వ్యక్తిగత మర్యాద, విలువలు, నైతికత, చిత్తశుద్ధి వంటివాటి విషయంలో జస్టిస్ గొగోయ్ అత్యంత గౌరవనీయులని స్పష్టం చేశారు. చెప్పుకోదగినంత ట్రాక్ రికార్డ్ లేనటువంటి, అసంతృప్తికి లోనైన ఓ వ్యక్తి చేసిన ఆరోపణలను ఏమాత్రం సరిచూడకుండా భుజానికెత్తుకోవడం సీజేఐ వ్యవస్థను అస్థిరపరిచే ప్రక్రియకు సహాయపడటమేనని హెచ్చరించారు. కొన్నేళ్ళుగా వ్యవస్థా విధ్వంసకులు ఏకీకృతం కావడం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వీరిలో చాలా మంది వామపక్షాలు లేదా అతివాద వామపక్షాల సిద్ధాంతాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారన్నారు. వారికి ఎన్నికల పునాది కానీ, ప్రజల మద్దతు కానీ లేవని, అయినప్పటికీ మీడియా, మేథావి వర్గాల్లో అవసరానికి మించి ప్రాధాన్యం పొందుతున్నారని అన్నారు.
 
బార్‌లో కొందరు న్యాయవాదులపై కూడా జైట్లీ మండిపడ్డారు. వీరు తమకు అనుకూల తీర్పులు రానపుడు న్యాయమూర్తులపైనా, చివరికి ప్రధాన న్యాయమూర్తిపైనా, బహిరంగ ఆరోపణలు చేస్తారన్నారు. సత్యం పట్ల వీరికి కొంచెం కూడా గౌరవం లేదన్నారు. అయినప్పటికీ ప్రజా ప్రయోజనాల పరిరక్షకులము తామేనని చెప్పుకుంటారన్నారు.
 
ఈ సందర్భంగా జైట్లీ కాంగ్రెస్‌ను కూడా వదిలిపెట్టలేదు. న్యాయమూర్తులతోపాటు సీజేఐని సైతం అభిశంసించేందుకు అభిశంసన తీర్మానంపై పార్లమెంటేరియన్ల సంతకాల కోసం తరచూ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
 
గత ఏడాది అప్పటి సీజేఐ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *