సుప్రీం ప్రధాన న్యాయమూర్తిపై మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు


న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. గతేడాది అక్టోబర్ 10, 11 తేదీల్లో ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులోని 22 మంది న్యాయమూర్తులకు ఆమె ఫిర్యాదు చేశారు. ‘‘ఆయన నా నడుము పట్టుకుని కౌగిలించుకున్నారు. హత్తుకుంటూ శరీరమంతా తన చేతులతో తడిమారు. బయటికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. నిశ్చేష్టురాలైన నేను ఆయన నిర్బంధాన్ని వదిలించుకునేందుకు ఎంత గట్టిగా ప్రయత్నించినా ఆయన నన్ను వదల్లేదు. అంతటితో ఆగకుండా నన్ను ‘హత్తుకో’ అని అన్నారు…’’ అంటూ 35 ఏళ్ల సదరు ఉద్యోగిని తన లేఖలో పేర్కొన్నారు.
 
జస్టిస్ రంజన్ గొగోయ్ కోరికను తాను తిరస్కరించడంతో.. 2018 ఆగస్టు నుంచి ఆయన రెసిడెన్స్ ఆఫీసులో పనిచేస్తున్న తనను బయటికి పంపించేశారని ఆమె ఆరోపించారు. రెండు నెలల తర్వాత అంటే డిసెంబర్ 21న ఆమెను విధుల నుంచి డిస్మిస్ చేశారు. ఒకరోజు సెలవు పెట్టేందుకు ముందస్తు అనుమతి తీసుకోని కారణంగా ఆమెను తొలగించారు. ఆమెను తొలగించిన తర్వాత జరిగిన పరిణామాలను సైతం ఆమె తన లేఖలో సుదీర్ఘంగా పేర్కొన్నారు. తనతో పాటు తన కుటుంబంపైనా చీఫ్ జస్టిస్ వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఢిల్లీ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న తన భర్త, మరిదిని చిన్న కాలనీ తగాదా పేరు చెప్పి సస్పెండ్ చేశారన్నారు. వాస్తవానికి ఇరుపక్షాలు రాజీకి రావడంతో అంతకుముందే ఆ తగాదా ముగిసిందనీ.. అయినా కూడా వారిని వదిలిపెట్టలేదన్నారు.
 
అనంతరం తాను ఓ పోలీసు అధికారిని వెంటబెట్టుకుని జస్టిస్ గొగోయ్ ఇంటికి వెళ్లాననీ… ఆయన భార్య కూడా తన పట్ల దారుణంగా వ్యవహరించారన్నారు. కారణం కూడా తెలియకుండా తనను సాష్టంగపడి ఆమె పాదాలకు ముక్కురాస్తూ క్షమాపణ చెప్పాలని గొగోయ్ భార్య డిమాండ్ చేశారన్నారు. అంతటితో ఆగకుండా తన పైనా, తన భర్తపైనా ‘తప్పుడు కేసు’ పెట్టారన్నారు. ఓ చీటింగ్ కేసులో తనను, తన భర్త, బావ మరిది, ఆయన భార్య, మరో బంధువును అరెస్టు చేశారని సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఇచ్చిన అఫిడవిట్‌లో ఆమె పేర్కొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *