సుప్రీం సీజే లైంగిక వేధింపుల కేసు… జస్టిస్ చంద్రచూడ్ సంచలన లేఖ..


న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌ లైంగిక వేధింపుల ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తు తీరు సుప్రీంకోర్టు జడ్జిల మధ్య తీవ్ర చర్చకు దారితీసినట్టు కనిపిస్తోంది. ఈ కేసుపై అంతర్గత విచారణ జరుపుతున్న జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య కమిటీతో జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నారీమన్‌లు సమావేశమయ్యారంటూ వచ్చిన వార్తలు సంచలనం సృష్టించగా… తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ కమిటీలోకి ఓ మాజీ మహిళా న్యాయమూర్తిని స్వతంత్ర సభ్యురాలిగా తీసుకోవాలంటూ జస్టిస్ బోబ్డేకి జస్టిస్ చంద్రచూడ్ లేఖ రాసినట్టు ఓ జాతీయ పత్రిక పేర్కొంది. ఈ లేఖ కేవలం ఆయన ఒక్కరి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదనీ.. ఈ కేసు విషయమై సుప్రీంకోర్టు జడ్జిలందరిలో నెలకొన్న ఆందోళన గురించి ఆయన వివరించారని వెల్లడించింది. దాదాపు 17 మంది న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపిన అనంతరం జస్టిస్ చంద్రచూడ్ ఈ లేఖ రాసినట్టు సమాచారం. స్వంతంత్ర సభ్యురాలిగా విశ్రాంత మహిళా న్యాయమూర్తులు జస్టిస్ రూమా పాల్, సుజాతా మనోహర్, రంజన ప్రసాద్ దేశాయ్ తదితరుల పేర్లు ఈ లేఖలో సూచించినట్టు తెలుస్తోంది. ఫిర్యాదుదారు లేవనెత్తిన ఇబ్బందులను అంతర్గత విచారణ కమిటీ వినాలని కూడా జస్టిస్ చంద్రచూడ్ తన లేఖలో కోరినట్టు సమాచారం.
 
కాగా ఈ కేసులో ఓ సీనియర్ మహిళా న్యాయవాదిని సుప్రీంకోర్టు అమికస్ క్యూరీగా నియమించాలని… తద్వారా సర్వోన్నత న్యాయస్థానం ప్రతిష్ట ‘‘దెబ్బతినకుండా’’ చూడాలని కూడా జస్టిస్ చంద్రచూడ్ కోరినట్టు మరో ఆంగ్ల పత్రిక వెల్లడించింది. కాగా తనకు లాయర్‌ను పెట్టుకునేందుకు, న్యాయసహాయం పొందేందుకు అనుమతి ఇవ్వలేదని ఫిర్యాదుదారు ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్యానెల్ తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం కూడా లేదంటూ విచారణకు వచ్చేందుకు కూడా ఈ  మాజీ మహిళా ఉద్యోగి నిరాకరించింది. 
 
ఈ పరిణామాలన్నిటిపై చర్చించేందుకు పూర్తిస్థాయి కోర్టును సమావేశపర్చాలని జస్టిస్ చంద్రచూడ్ పిలుపునిచ్చినట్టు వినిపిస్తోంది. తన లేఖలోని అంశాలపై చర్చించేందుకే జస్టిస్ బోబ్డేతో జస్టిస్ చంద్రచూడ్ ఈ నెల 2న కలిసినట్టు ప్రముఖ ఆంగ్లపత్రిక పేర్కొంది. 2022లో జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది. కాగా జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నారీమన్‌ ఇద్దరూ జస్టిస్ బోబ్డేతో శుక్రవారం సమావేశమైనట్టు ఓ పత్రికలో వచ్చిన వార్తలను సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ఖండించిన సంగతి తెలిసిందే. 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *