‘సెలెక్టెడ్‌’ చీటింగ్‌


  • పనులు, ఫర్నీచర్‌, ఆఫీసంటూ బెజవాడ అడ్డాగా భారీ మోసాలు
  • 128 మంది నుంచి కోటి వసూలు
  • పోలీసులకు పట్టిచ్చిన బాధితులు
విజయవాడ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలనుకున్నాడు. ఎలా మోసపోయాడో అలాగే మోసాలు చేశాడు. మూడు రకాల ఎంవోలతో 13 జిల్లాలవాసులను నిలువునా ముంచేశాడు. పట్టణానికి ఓ పేరుతో వలస వెళ్లి, మరో పేరుతో మకాం మార్చి అక్షరాలా కోటి రూపాయలను వెనుకేసుకున్నాడు. ఉద్యోగాలు, ఆఫీసుల అద్దెలు, ఫర్నీచరు, స్వచ్ఛభారత్‌లో కాంట్రాక్టుల మాయవలను విసిరి నిరుద్యోగులు, ఇంటి యజమానులు సహా 128 మందికి రూ.కోటి టోకరా ఇచ్చాడు. చివరకు విజయవాడ పోలీసులకు దొరికిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం, సలాది రామ్‌గోపాల్‌.. శ్రీకాకుళం జిల్లా హిరమండలం నివాసి. 2006లో వెంకట నారాయణ అనే వ్యక్తి రామ్‌గోపాల్‌కు ఓ పని అప్పగించాడు. ఆ జిల్లాలో ఉన్న వికలాంగులకు సంబంధించి మొత్తం వివరాలను సేకరించి, ఆ డేటా ఇస్తే కేంద్రం నుంచి నిధులొస్తాయని చెప్పాడు. అందుకు అంగీకరించిన రామ్‌గోపాల్‌, కొంతమందిని నియమించుకుని సర్వే చేయించాడు.
 
ఈ క్రమంలో కొంతమంది వికలాంగుల నుంచి డబ్బులు కూడా వసూలు చేశాడు. ఈ మొత్తం డేటాను, నగదును వెంకటనారాయణకు ఇచ్చాడు. అవి చేతిలో పడటంతోనే వెంకట నారాయణ మాయమయ్యాడు. బాధిత వికలాంగుల ఫిర్యాదుపై శ్రీకాకుళం టూ టౌన్‌ పోలీసులు రామ్‌గోపాల్‌ను అరెస్టు చేసి, కటకటాల వెనక్కి పంపారు. జైలు నుంచి బయటకు వచ్చిన అతడు.. తాను మోసపోయిన మార్గాన్నే తన ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. బెజవాడను అడ్డాగా మార్చుకొన్నాడు. భవానీపురానికి చెందిన బుస్సాల సత్య సూర్యకిరణ్‌ ఇంటర్నెట్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు.
 
అదే ప్రాంతంలోని నూరి మసీదు వద్ద రామ్‌గోపాల్‌ అద్దెకు ఇల్లు తీసుకొన్నాడు. రోజూ ఆ నెట్‌ సెంటర్‌కు వెళుతూ, సూర్యకిరణ్‌తో పరిచయం పెంచుకున్నాడు. తాను ఢిల్లీలోని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నానని, త్వరలోనే ఇక్కడికి మారుతున్నామని చెప్పాడు. స్వచ్ఛభారత్‌ పథకంలో కార్మికులను సరఫరా చేసే కాంట్రాక్ట్‌లు, తాను పనిచేస్తున్న శాఖలో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలు, జిల్లాల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్‌, జిల్లా కోఆర్డినేటర్లు, మండల కోఆర్టినేటర్ల ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించాడు. పరిచయం ఉన్నవారు ఎవరైనా ఉంటే, పనిచేసి పెడతానని చెప్పాడు. ఇదంతా నిజమేనని నమ్మేశాడు సూర్యకిరణ్‌. స్వచ్ఛభారత్‌ కాంట్రాక్ట్‌ను దక్కించుకోవడానికి రామ్‌గోపాల్‌కు రూ.50 లక్షలు ఇచ్చాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితులను అతడికి పరిచయం చేశాడు. వారి నుంచి రామ్‌గోపాల్‌ రూ.15, రూ.20, రూ.25లక్షలు చొప్పున లాగేశాడు. ఈ వ్యవహారంలో అతడికి భార్య రేవతి, బావమరిది దొడ్డి కిరణ్‌, డ్రైవర్‌ యాళ్ల రాము సహకరించారు.
 
ఢిల్లీలో ఇంటర్వ్యూ..బెజవాడలో ఇల్లు..
ఉద్యోగాలపై ఆశతో డబ్బులు ఇచ్చిన వారిని ఇంటర్వ్యూల కోసమని ఢిల్లీలోని నిర్మల్‌ భవన్‌కు రామ్‌గోపాల్‌ తీసుకెళ్లాడు. చివరి నిమిషంలో ఇంటర్వ్యూలు రద్దయ్యాయని, నియామకపు ఉత్తర్వులు నేరుగా ఇళ్లకు వచ్చేస్తాయని వారిని పంపేశాడు. ఇప్పటికీ వారికి ఉత్తర్వులు అందనే లేదు. ఇంతలో మరో మోసానికి తెర తీసేశాడు. ్టఒకసారి ఉపయోగించిన వస్తువులను ఓఎల్‌ఎక్స్‌ వెబ్‌సైట్‌లో చౌకగా విక్రయిస్తుంటారు. అద్దెకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంచిన ఇళ్ల చిరుమానాలను ఆ సైట్‌ ద్వారా నోట్‌ చేసుకొన్నాడు. ఆయా నివాసాల యజమానుల వద్దకు వెళ్లాడు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయం కోసం అద్దె నివాసాల కోసం అన్వేషిస్తున్నామని చెప్పాడు. నెలకు రూ.45వేలు చొప్పున మూడేళ్లకు అగ్రిమెంట్‌ చేసి రూ.16లక్షల అద్దె ఇస్తారని యజమానులను నమ్మించేవాడు. ఆ మొత్తంలో మూడు శాతం అంటే రూ.48వేలు తనకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి, ముందుగానే ఆ మొత్తం తీసుకునేవాడు. అంతేకాదు, కార్యాలయానికి ఫర్నీచర్‌ అవసరమంటూ కొనిపించేవాడు. ఆ బిల్లులు కేంద్ర కార్యాలయమే చెల్లిస్తుందని చెప్పేవాడు. తీరా కొన్న తరువాత ఆ బిల్లుల క్లియరెన్స్‌ కోసమంటూ కమీషన్‌ తీసుకొనేవాడు.
 
భరతం పట్టిన బాధితులు
కొద్దిరోజుల క్రితం రాత్రికి రాత్రి బోర్డు రామ్‌గోపాల్‌ తిప్పేశాడు. చడీచప్పుడు లేకుండా భవానీపురంలోని ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతుండగా, బాధితులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రామ్‌గోపాల్‌ నుంచి 272 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2లక్షలు, కారు, బైక్‌, ల్యాప్‌టాప్‌, నాలుగు సెల్‌ఫోన్లు, బ్యాంక్‌ ఖాతా పుస్తకం, నకిలీ స్టాంపులు, నకిలీ ధ్రువీకరణపత్రాలు, అగ్రిమెంట్‌ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై ఇప్పటికే హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాలు, విజయనగరం జిల్లాల్లో మొత్తం 22 కేసులు ఉన్నాయి. విజయవాడలో భవానీపురం, సత్యనారాయణపురం, పెనమలూరు, పటమట, కృష్ణలంక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయని సిటీ రెండో ఉపకమిషనర్‌ సీహెచ్‌ వెంకట అప్పలనాయుడు తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *