సౌరకాంతులు


నగరంలోని పాత, కొత్త ప్రభుత్వాస్పత్రులకు త్వరలో సూర్యకాంతులు రాబోతున్నాయి. ప్రస్తుతం తడిసి మోపెడవుతున్న విద్యుత్తు బిల్లులను చెల్లించలేక విలవిల్లాడుతున్న సర్కారు దవాఖానాలకు సగానికి సగం బిల్లులు ఆదా కానున్నాయి. ఆసుపత్రులకు సూర్యకాంతులేమిటి? కరెంటు బిల్లులు తగ్గడమేంటనేగా మీ సందేహం. సహజ వనరులను వినియోగించుకొని పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంతోపాటు ప్రజారోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సౌరశక్తితో విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఎక్కడికక్కడ సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో కరెంటు బిల్లులను తగ్గించే లక్ష్యంతో ఈ సోలార్‌ పవర్‌ ప్లాంట్లను సిద్ధం చేస్తోంది. వీటిలో విద్యుత్‌ సమస్యలకు చెక్‌ పెట్టడంతోపాటు నెలవారీ బిల్లులను గణనీయంగా తగ్గించేందుకు ఆయా ఆస్పత్రులపై సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తోంది. విజయవాడ పాత, కొత్త ప్రభుత్వాస్పత్రులతోపాటు ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ, ప్రభుత్వ దంత వైద్యశాల, కళాశాలలపై సోలార్‌ పవర్‌ ప్లాంట్లను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వ ఆసుపత్రి భవనాలపై సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి.
 
విజయవాడ ఆంధ్రజ్యోతి: సర్వజన ఆస్పత్రిలో సోలార్‌ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి భవనాలపై రెస్కో మోడల్‌లో రూఫ్‌ టాప్‌ స్మాల్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వినియోగిస్తున్న విద్యుత్‌కు ఒక యూనిట్‌కు రూ.7.60 పైసలు చొప్పున బిల్లు చెల్లిస్తుస్తున్నారు.
 
రూఫ్‌ టాప్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌కు ఒక యూనిట్‌కు కేవలం రూ. 3.64కే సరఫరా చేస్తామంటూ మహారాష్ట్ర రెస్కో రూఫ్‌ టాప్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ముందుకు వచ్చి కాంట్రాక్టును దక్కించుకుంది. 25 సంవత్సరాల వరకు ఇదే రేటుకు విద్యుత్‌ను సరఫరా చేసేలా సదరు కాంట్రాక్టు సంస్థతో రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు. దీని ప్రకారం రూఫ్‌ టాప్‌ సోలార్‌ ప్లాంట్‌ డిజైనింగ్‌, మ్యాన్‌ఫాక్చరింగ్‌, సప్లయ్‌, ఎరక్షన్‌, టెస్టింగ్‌, ఆపరేషన్స్‌, నిర్వహణ, ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లింపులు.. ఇలా మొత్తం బాధ్యతలను కాంట్రాక్టు సంస్థే చూసుకునేలా పక్కాగా పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ రాయించుకున్నారు.
 
పవర్‌ గ్రిడ్‌తో అనుసంధానం
ప్రభుత్వాస్పత్రుల భవనాలపై ఏర్పాటు చేస్తున్న సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏపీఎస్‌పీడీసీఎల్‌కు చెందిన పవర్‌ గ్రిడ్‌తో అనుసంధానిస్తారు. ఈ సోలార్‌ పవర్‌ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్‌ను లెక్కించేందుకు జాయింట్‌ మీటరింగ్‌ (నెట్‌ మీటరింగ్‌) వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నెలకు ఎన్ని యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అయితే.. అంతమేర ఆస్పత్రి నిధుల నుంచే బిల్లులు చెల్లిస్తారు. ఈ ప్రాతిపదికన విజయవాడ హనుమాన్‌పేటలోని పాత ప్రభుత్వాస్పత్రికి 150 కిలో వాట్లు, గుణదలలోని కొత్త ప్రభుత్వాస్పత్రిలో 200 కిలో వాట్లు, ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీకి 500 కిలోవాట్లు… గవర్నమెంటు డెంటల్‌ కాలేజీ, హాస్పిటల్‌కు 100 కిలో వాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి నెలా నిర్దేశించిన స్థాయిలో సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేకపోతే.. తక్కువ వచ్చిన యూనిట్లకు కాంట్రాక్టు సంస్థ తిరిగి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
 
సగానికి సగం తగ్గనున్న విద్యుత్‌ భారం
సోలార్‌ పవర్‌ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే విజయవాడ ప్రభుత్వాస్పత్రికి కరెంటు బిల్లుల భారం సగానికి సగం తగ్గనున్నాయి. ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది బాధ్యతారాహిత్యంతో ప్రతి నెలా కరెంటు బిల్లు మోత మోగుతోంది. వేసవిలో అయితే ప్రభుత్వ ఆసుపత్రి కరెంటు బిల్లు దాదాపు రూ. 25 లక్షలకు చేరుకుంటోంది. గత ఏడాది మార్చి నెలలో విజయవాడ పాత, కొత్త ఆస్పత్రులకు కలిపి రూ. 16,90,037 వస్తే.. ఏప్రిల్‌ నెలలో రూ. 18,81,795 వచ్చింది. అదే మే నెలకు వచ్చేసరికి ప్రభుత్వాస్పత్రి కరెంటు బిల్లు రూ. 22,06,491కు పెరిగింది. ఈ ఏడాది కూడా అంతకన్నా భారీస్థాయిలోనే కరెంటు బిల్లులు వచ్చే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. త్వరలో సోలార్‌ పవర్‌ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే యూనిట్‌కు రూ. 3.64 పైసలే చార్జి చేస్తారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *