‘స్థానిక’ సమరంపై దృష్టి!


  • ఓటరు జాబితా, కుల గణనపై కసరత్తు.. మే 1లోగా మున్సిపాలిటీల ప్రక్రియ కొలిక్కి
  • 10 లోగా పంచాయతీల జాబితాలు రెడీ
  • ప్రణాళికలు సిద్ధం చేస్తున్న స్థానిక నేతలు
  • కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాకే ఎన్నికలు
అమరావతి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సార్వత్రిక సమరం ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, కులాల వారీ ఓటర్ల సంఖ్య, వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను మే 10లోగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌ అధికారులు అన్ని జిల్లాల డీపీఓ కార్యాలయాల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో మున్సిపల్‌ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మే 1నాటికి అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని వార్డులు, డివిజన్లకు సంబంధించి ఫోటో ఓటరు జాబితాలు సిద్ధం చేయాలని, రాష్ట్రం యూనిట్‌గా తీసుకుని ఆయా మున్సిపల్‌ చైర్మన్లు, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయాలని అధికారులు సూచించారు.
 
ఇటీవల ఉపయోగించిన అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల విభజన ప్రక్రియ చేపట్టాలని పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పంచాయతీల్లో రిజర్వేషన్లను నిర్ణయిస్తారు. పట్టణాల్లో విలీనమైన గ్రామ పంచాయతీలకు డీనోటిఫికేషన్లతో పాటు ఎక్కడైనా పంచాయతీల విభజన ఉంటే దానిపై దృష్టి సారించారు. కాగా.. మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలై కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారు.
 
ప్రత్యేకాధికారులతో నెట్టుకొస్తున్నారు..
స్థానికసంస్థల ఎన్నికలు ఆలస్యం కావడం షరా మామూలుగానే ఉంటోంది. పంచాయతీల గడువు పూర్తయినా.. గతంలో కూడా ప్రత్యేకాధికారుల పాలన పెట్టిన అనుభవం ఉమ్మడి రాష్ట్రంలో ఉంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత హఠాన్మరణంతో రోశయ్య సీఎం అయ్యారు. అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం స్పీడందుకోవడంతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోయింది. ఈనేపథ్యంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ 2011 ఆగస్టు 22న జీఓ నెం.269ను విడుదల చేసింది.
 
రెండేళ్ల పాటు ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామ పంచాయతీలు కొనసాగాయి. తిరిగి 2013 ఆగస్టు 2కు ఎన్నికలు పూర్తయి గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ల పాలన ప్రారంభమైంది. గతేడాది 2018 జూలై నెలాఖరుకు గ్రామ పంచాయతీల పదవీకాలం పూర్తి కావడంతో ఆగస్టు 2 నుంచి అన్నిచోట్ల ప్రత్యేకాధికారులను నియమించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకాధికారుల పాలనపై మొగ్గు చూపింది.
 
ఆగిన 14వ ఆర్థికసంఘం నిధులు…
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తేనే 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయి. కానీ సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో 2018-19 సంవత్సరానికి 14వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు రూ.1000 కోట్ల మేర విడుదల కాలేదు. 2019-20 సంవత్సరానికి కూడా ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రూ.2622 కోట్ల మేర నిధులు రావాల్సి ఉంది. అంటే గ్రామ పంచాయతీలు సకాలంలో ఎన్నికలు నిర్వహించనందున రాష్ట్రానికి రావాల్సిన రూ.3600 కోట్లకు పైగా నిధులు ఆగిపోయాయన్నమాట.
 
పంచాయతీల ఎన్నికలపైనే చర్చ
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీల ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కూడా ఈప్రక్రియను ప్రారంభించడంతో స్థానిక నేతలు దానిపై దృష్టి పెడుతున్నారు. సామాజిక సమీకరణాలు చూసుకొని పోటీలకు సిద్ధమవుతున్నారు. గతంలో కేటాయించిన సామాజిక వర్గాలకే సర్పంచ్‌, ఎంపీటీసీ పదవులు కేటాయిస్తారా..? లేదంటే మార్పు ఉంటుందా.. అంటూ లెక్కలు వేసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికల రచిస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *