హైదరాబాద్‌ సిటీ బస్సులో ఫైరింగ్‌!


  • తోటి ప్రయాణికుడితో ఆంధ్ర పోలీస్‌ వాగ్వాదం
  • క్షణికావేశంలో పైకప్పుకు గురిపెట్టి కాల్పులు
  • శాఖాపరమైన చర్యలకు ఏపీ డీజీపీ హామీ
హైదరాబాద్‌ సిటీ/అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నడిబొడ్డున పంజగుట్ట స్మశాన వాటిక వద్ద పట్టపగలు సిటీ బస్సులో కాల్పులు జరిగాయి. ఏపీ ఇంటెలిజెన్స్‌ భద్రత విభాగానికి చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ గురువారం ఉదయం 11 గంటలకు సిటీ బస్సులో వెళుతున్నపుడు తోటి ప్రయాణికుడితో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన శ్రీనివాస్‌ సర్వీస్‌ రివాల్వర్‌ తీసి, కిక్కిరిసి ఉన్న బస్సులో పైకప్పుకు గురిపెట్టి కాల్పులు జరిపాడు. దాంతో బస్సు పైకప్పులోంచి నుంచి తూటా దూసుకువెళ్లింది. కాల్పుల శబ్ధంతో ప్రయాణికులు బెంబేలెత్తి పోయారు. చాలామంది ప్రయాణికులు నెమ్మదిగా వెళుతున్న బస్సులోంచి దూకేశారు. శ్రీనివాస్‌ కూడా వారితో పాటు బస్సుదిగి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. తుపాకి పేలుడుతో ఉలిక్కిపడిన బస్సు డ్రైవర్‌ బస్సును కాస్త ముందుకు తీసుకెళ్లి ఆపాడు. డ్రైవర్‌, కండక్టర్‌ ఇద్దరూ వెనక్కి వచ్చి చూశారు. వెనుక సీట్లలో ప్రయాణికులు జరిగిన విషయం చెప్పారు.
 
వెనుక డోరు వద్ద బస్సు పైకప్పుకు బుల్లెట్‌ రంధ్రం ఉండటం గమనించిన డ్రైవర్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి సూచన మేరకు ప్రయాణికులను ఫిల్మ్‌నగర్లో దింపేసి, బస్సును నేరుగా కంటోన్మెంట్‌ డిపోకు బస్సును తీసుకెళ్లారు. శ్రీనివా్‌సపై ఆర్మ్‌డ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశామని ఏసీపీ తిరుపతన్న తెలిపారు. అతనితో ఘర్షణ పడ్డ వ్యక్తుల వివరాలూ సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై ఏపీ డీజీపీ ఠాకూర్‌కు సమాచారం అందించారు. శ్రీనివా్‌సపై ఏపీ పోలీసు శాఖ విచారణకు ఆదేశించింది. నివేదిక ఆధారంగా బాధ్యుడిని సస్పెండ్‌ చేస్తామని డీజీపీ ప్రకటించారు. ప్రజల మధ్యలో బాధ్యత కలిగిన పోలీసు ఇటువంటి చర్యకు పాల్పడటం చట్టరీత్యా పెద్ద నేరమన్నారు. బుల్లెట్‌ బస్సు టాప్‌పైకి దూసుకెళ్లిందని, ప్రయాణికులకు ఎలాంటి హాని జరగక పోవడం అదృష్టమన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *