112తో ‘నిర్భయ’మే


  • మహిళల భద్రత కోసం ప్రత్యేక నంబరు
  • కాల్‌ సెంటర్‌ ఏర్పాటు.. 321 కోట్లు మంజూరు
  • దేశమంతా త్వరలోనే అమల్లోకి..
అమరావతి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ వ్యవస్థను ఏర్పాటుచేసింది. అత్యవసర పరిస్థితుల్లో 112 నంబరుకు కాల్‌ చేసి, ఈ సెంటరు సేవలను పొందవచ్చు. పాన్‌ ఇండియా నెట్‌వర్క్‌లో భాగంగా ఈ సింగిల్‌ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ప్రవేశపెట్టారు. మన రాష్ట్రంతోపాటు తెలంగాణ, కేరళ, మధ్యప్రదేశ్‌; రాజఽస్థాన్‌, జమ్మూకశ్మీర్‌ సహా 20 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో త్వరలోనే 112 సేవలు అందుబాటులోకి రానున్నాయి. నిర్భయ్‌ నిధులతో నిర్వహణ, సేవలు అందించేలా ఈ కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది.
 
మొత్తం రూ. 321.69 కోట్లు దీనికోసం వెచ్చించనుంది. అందులో 278.66 కోట్లు ఇప్పటికే రాష్ట్రాలకు అందాయి. తాను నెలకొల్పుతున్న కాల్‌ కాల్‌ సెంటర్లకు (ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్లు) పోలీస్‌ (100), ఫైర్‌ (101), ఉమెన్‌ (1090) హెల్త్‌ లైన్‌ నంబర్లకు కూడా కేంద్రం అనుసంధానం చేసింది. ఇప్పటికే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన 112 నంబర్‌ను అన్ని రకాల అత్యవసర పరిస్థితుల్లో బాధితులు ఉపయోగించుకునే విధంగా తీర్చిదిద్దింది. ఇప్పటికే ప్యానిక్‌ బటన్‌ను సిద్ధం చేసింది. దీనిని అన్ని మొబైల్‌ ఫోన్లలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంది. ఈ పనినంతా పర్యవేక్షించడం కోసం కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటుచేసింది.
 
ఇలా చేస్తే చాలు..
టోల్‌ఫ్రీ నంబరు 112కు వాయిస్‌ కాల్‌ చేయొచ్చు. లేక ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందించవచ్చు. లేక 112 మొబైల్‌ యాప్‌లోని పవర్‌ బటన్‌ను వెంట వెంటనే మూడుసార్లు ప్రెస్‌ చేసినా చాలు. ఈ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్స్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒకవేళ స్మార్ట్‌ఫోన్‌ లేకపోయినట్టయితే, బాధితులు తమ వద్ద ఉన్న సాధారణ ఫోన్‌లోనే ఐదు లేదా తొమ్మిది బటన్‌ను గట్టిగా ప్రెస్‌ చేసినా సరిపోతుంది. ఈ సెంటర్‌ (ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సపోర్టు సిస్టమ్‌) వెబ్‌సైట్‌కు మెయిల్‌ పంపినా చాలు.. వారి సమాచారం చేరిపోతుంది. ఆ సమాచారం, ఫోన్‌ నంబర్‌ ఆధారంగా కాల్‌ ఎక్కడనుంచి వచ్చిందనేది తెలుసుకొని, సిబ్బంది అప్రమత్తం అవుతారు. వెనువెంటనే స్థానికంగా ఉన్న పోలీసులకు ఆ సమాచారం అందిస్తారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *