2002 అల్లర్లపై గుజరాత్ సర్కార్‌కు సుప్రీం సంచలన ఆదేశం


న్యూఢిల్లీ:  పదహారేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు మంగళవారంనాడు సంచలన తీర్పునిచ్చింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానోకు రెండు వారాల్లోగా రూ.50 లక్షల నష్టపరిహారం, ఉద్యోగం, నివాసం కల్పించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. తప్పిదాలకు పాల్పడిన అధికారులకు పెన్షన్ ప్రయోజనాలను నిలిపివేయాలని, ముంబై హైకోర్టు దోషులుగా తేల్చిన ఐపీఎస్ అధికారికి రెండు ర్యాంకులు డిమోట్ (తగ్గించాలని) చేయాలని ఆదేశించింది.
 
అప్పట్లో 19 ఏళ్ల వయస్సున్న బానో తన కుటుంబ సభ్యులతో కలిసి ట్రక్‌లో వెళ్తుండగా అల్లర్ల మూక అడ్డుకుని దాడికి దిగింది. 5 నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారం జరిపారు. బానో రెండేళ్ల కుమార్తెతో పాటు 14 మంది కుటుంబ సభ్యులను అత్యంత కిరాతకంగా హతమార్చారు. గుజరాత్ ప్రభుత్వం బానోకు గతంలో రూ.5 లక్షలు పరిహారం ఇవ్వచూపింది. అయితే ఆ పరిహారం తీసుకునేందుకు ఆమె నిరాకరించారు. తనకు జరిగిన అపార నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అసాధారణ పరిహారం కోరుతూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *