24×7 పొలిటీషియన్‌


  • నరేంద్ర మోదీకి కళ్లు, చెవులు!.. అపరచాణక్యుడు.. అమిత్‌ షా
వ్యక్తిగతం
పూర్తిపేరు: అమిత్‌ అనిల్‌ చంద్ర షా
పుట్టినరోజు: 1964, అక్టోబరు 22
విద్యార్హత: బీఎస్సీ బయోకెమిస్ట్రీ
భార్య: సోనాల్‌ షా
కుమారుడు: జే షా
 
మోదీ ప్రస్తావన లేకుండా ఆయన గురించి చెప్తే అది అసంపూర్ణమే. ఆయనే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా. బాగా సంపన్న కుటుంబాల్లో పుట్టినవారి గురించి చెప్పాల్సి వస్తే.. ‘నోట్లో సిల్వర్‌ స్పూన్‌ (వెండి చెంచా)తో పుట్టాడు’ అని చెబుతారు! అలా చెపాల్పంటే.. అమిత్‌షా ‘నోట్లో బంగారు చెంచా’తో పుట్టారని చెప్పొచ్చు. ఆయన తండ్రి అంత ధనవంతుడైన వ్యాపారి. తరాలు తిన్నా తరగని ఆస్తి. అందుకే.. కుటుంబ పోషణ బాధ్యతలు పెద్దగా లేని షా తనజీవితాన్ని పూర్తిగా రాజకీయాలకే అంకితం చేశారు. ఇంట్లో వాళ్లు ఆయనకు పెట్టుకున్న ముద్దు పేరు..
 
24×7 పొలిటీషియన్‌.
అది.. గుజరాత్‌లో కేశూబాయ్‌ పటేల్‌ హవా నడుస్తున్న కాలం. మోదీకి, ఆయనకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుండేది. ఎంతైనా కేశూభాయ్‌.. మోదీకన్నా సీనియర్‌, ముఖ్యమం త్రి. అందుకే అధిష్ఠానం ఆయన మాట విని మోదీని కొన్నాళ్లపాటు ఢిల్లీకి పంపేసింది. గుజరాత్‌కు రావద్దని ఆంక్ష విధించింది. మరి అప్పుడు ఢిల్లీలో ఉన్న మోదీకి గుజరాత్‌లో ఏం జరుగుతోందో చెప్పేదెవరు? ఇంకెవరు.. ఆయనకు అత్యంత సన్నిహితుడైన అమిత్‌ షానే. అందుకే ‘మోదీ కళ్లు, చెవులు’ అని అమిత్‌ షాకు పార్టీ కార్యకర్తలు ముద్దు పేరు పెట్టారు. 1995 నుంచి 2001 దాకా.. ఆరేళ్లపాటు మోదీకి అమిత్‌ షా గుజరాత్‌లో నిజంగానే కళ్లు, చెవులుగా పనిచేశారు. తర్వాత మోదీ రాకతో ఆయన హవా పెరిగిపోయింది.
 
మోదీ సీఎం అయ్యాక అమిత్‌ షాకు హోం శాఖ సహా 10 శాఖల బాధ్యతలు అప్పజెప్పారు! తాను ప్రధా ని అయ్యాక ఏకంగా పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు!! వీరిద్దరి మధ్య బంధం ఇంత బలపడటానికి కారణం అమిత్‌ షా మేధస్సే. 1980ల్లో మోదీ అహ్మదాబాద్‌ జిల్లా ఆరెస్సెస్‌ ప్రచారక్‌గా నిర్వహించిన సమావేశాల్లో షా ఇచ్చే సలహాలు, జరిగిన సంఘటనలను విశ్లేషించే తీరు మోదీని ఆకట్టుకుంది. మోదీ గుజరాత్‌ బీజేపీ కార్యదర్శి అయ్యాక బూత్‌ మేనేజ్‌మెంట్‌, వ్యూహాల రూపకల్పన వంటి కీలకబాధ్యతలను అమిత్‌ షాకు అప్పజెప్పారు. అప్పట్లో వారిద్దరూ కలిసి చేసిన ప్రధానమైన పని.. గుజరాత్‌ వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ అత్యంత ప్రభావశీలురైన ద్వితీయ శ్రేణి నేతలను గుర్తించి పార్టీలో చేర్చుకున్నారు. ఫలితంగానే 1995లో ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
 
అలుపెరగని కృషి
మొదటే చెప్పుకొన్నట్టు.. అమిత్‌ షా 24్ఠ7 రాజకీయవేత్త. అది తప్ప ఆయన మదిలో వేరే ఆలోచనకు తావుండదు. నిరంతరం పార్టీ గురించే ఆలోచిస్తారు. ఉదాహరణకు.. పార్టీ జాతీయ అధ్యక్షుడయ్యాక ఆయన ‘హమ్మయ్య, పార్టీలో అత్యున్నత పదవి సాధించేశాం’ అనుకొని విశ్రాంతి తీసుకోలేదు. ఆ పదవి చేపట్టిన మూడేళ్లలో దేశవ్యాప్తంగా 303 పర్యటనలు జరిపారు! దేశంలోని 680 జిల్లాల్లో 315 జిల్లాలు తిరిగారు. కష్టపడితేనే ఫలితం అనే విషయంలో అమిత్‌ షాకు బాగా స్పష్టత ఉంది!! నిజమే.. ఆయన కష్టానికి తగ్గట్టే ఫలితాలూ వస్తున్నాయి!!
 
తెరవెనుకే మంత్రాంగం
వ్యూహాలు రచించడంలో అమిత్‌ షా అపరచాణక్యుడే. కానీ.. అంత మాటకారి కాదు. ఆయన మంత్రాంగమంతా తెరవెనుకే. షా వ్యూహాలు దీర్ఘకాలికంగా ఉంటాయి. తమకు పట్టున్న ప్రాంతాల్లో ఒకరకంగా, లేని ప్రాంతాల్లో మరో రకంగా వ్యూహం రచిస్తారాయన. ప్రత్యర్థుల ఊహకు అందని కోణాల్లో ఆలోచించడం అమిత్‌ షాకు అలవాటు. ఎక్కడికి వెళ్లినా ఆర్భాటం లేకుండా ఉండటం.. కిందిస్థాయి కార్యకర్తలతో భేటీ అయి స్థానిక, వాస్తవిక పరిస్థితులను తెలుసుకోవడం.. సమాచారాన్నంతా క్రోడీకరించుకుని ప్రాంతానికి తగ్గ వ్యూహం రచించడం.. పరిస్థితి అనుకూలంగా లేని చోట.. ప్రాంతీయ పార్టీలకు మద్దతిచ్చి తమ ఓటు షేరును పెంచే ప్రయత్నం చేయడం.. ఇదీ అమిత్‌ షా వ్యూహం.
 
తెరవెనుక ఈ వ్యూహం అమలవుతుంటే సరిగ్గా ఎన్నికలకు ముందు మోదీ వచ్చి తన చరిష్మాతో ఊపును మరింత పెంచుతారు. ఫలితంగా అనూహ్యమైన ఫలితాలు వస్తాయి. ప్రత్యర్థులు తేరుకునేలోగానే.. వారు మళ్లీ కోలుకోలేనంత నష్టం జరిగిపోయి ఉంటుంది. అయితే, దీనికి విరుగుడుగా ప్రతిపక్షాలు మహాకూటములు కట్టి సత్ఫలితాలు సాధిస్తున్నాయి. మరి ఆ వ్యూహానికి అమిత్‌ షా రచిస్తున్న ప్రతివ్యూహమేంటో.. ఫలితాల తర్వాతగానీ తెలీదు!!

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *