3 సీట్లలో 'ఆప్' అభ్యర్థుల నామినేషన్ వాయిదా


న్యూఢిల్లీ: ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి చందంలా ఢిల్లీలో ఆప్-కాంగ్రెస్ మధ్య పొత్తుల వ్యవహారం ఎంతకూ తెమలకపోవడంతో చిట్టచివరి ప్రయత్నంగా అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ‘ఆప్’ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ముగ్గురు ఆప్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను ఈనెల 22కు వాయిదా వేసింది. తద్వారా సీట్ల షేరింగ్ ఫార్ములాలో భాగంగా మూడు సీట్లు కాంగ్రెస్‌కు ఇవ్వగలమన్న సంకేతాలు పంపింది. ఇదే సమయంలో, కాంగ్రెస్‌తో హర్యానాలోనూ పొత్తు ఫార్ములా ఫైనల్ చేయాలని కూడా ‘ఆప్’ అభిలషిస్తోంది.
 
హర్యానాలో జన్‌నాయక్‌ జనతా పార్టీ (జేజేపీ)తో ఆప్‌ ఇప్పటికే పొత్తు పెట్టుకుంది. అయితే కాంగ్రెస్‌ను కలుపుకొని వెళ్లాలనే ఆలోచనలో ఆప్ ఉంది. ఇందుకు అనుగుణంగా 6-3-1 ఫార్ములాపై మంతనాలు సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ ప్రకారం 6 సీట్లలో కాంగ్రెస్, 3 సీట్లలో దుష్యంత్ చౌతాలా సారథ్యంలోని జన్‌నాయక్ జనతా పార్టీ (జేజేపీ), ఒక స్థానంలో ఆప్ పోటీ చేస్తాయి. కాగా, కాంగ్రెస్ ముందు తాజాగా మరో ఆఫర్‌ను కూడా ఆప్ ప్రతిపాదించినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. 6-3-1 ఫార్ములాకు బదులుగా 7-2-1 (కాంగ్రెస్-జేజేపీ-ఆప్) ఫార్ములాను ఆప్ ముందుకు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. తద్వారా కాంగ్రెస్ కోర్టులోనే ఆప్ బంతి వేసినట్టు చెబుతున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *