30 ఏళ్లుగా పసికందుల అమ్మకం


  • తమిళనాడులోని నామక్కల్‌ జిల్లాలో దారుణం
  • సోషల్‌ మీడియాలో ఫోన్‌ సంభాషణ వైరల్‌
  • విచారణకు ఆదేశించిన రాష్ట్ర ఆరోగ్యశాఖ
  • రిటైర్డ్‌ నర్సు, ఆమె భర్త అరెస్టు
చెన్నై, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): మగబిడ్డ కావాలంటే రూ.4లక్షలు. ఆడబిడ్డ కావాలంటే రూ.3 లక్షలు. ఎర్రగా ఉంటే ఒక రేటు. నల్లగా ఉంటే మరో రేటు. అప్పుడే పుట్టిన బిడ్డయితే ఇంకో రేటు. ఇలా పసికందులను అంగడి సరుకుగా మార్చి తమిళనాట ఓ ముఠా దారుణానికి ఒడిగట్టింది. 30ఏళ్లుగా పసికందుల విక్రయాలు సాగిస్తూ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. సంతానం లేని దంపతులతో రిటైర్డ్‌ నర్సు ఫోన్‌లో చేసిన బేరసారాల ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో ఈ గుట్టు రట్టయ్యింది. ఈ ఉదంతంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేశ్‌ విచారణకు ఆదేశించారు.
 
ఓ పసికందు విక్రయానికి సంబంధించి ధర్మపురి ప్రాంతానికి చెందిన సంతానం లేని దంపతులతో నామక్కల్‌ జిల్లా రాశిపురంలో ప్రభుత్వ ఆస్పత్రి రిటైర్డ్‌ నర్సు సంభాషణల ఆడియో వైరల్‌ అవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ రిటైర్డ్‌ నర్సు అముదాను అదుపులోకి తీసుకున్నారు. ముప్పైయ్యేళ్లుగా చేసిన నేరాలను విచారణలో ఆమె అంగీకరించింది. పసికందుల అమ్మకానికి సహకరించిన ఆమె భర్త రవిచంద్రన్‌ను కూడా అరెస్టు చేశారు. స్వచ్ఛంద సంస్థలు, రాశిపురం పురపాలక సంఘం అధికారులు, ప్రభుత్వాస్పత్రుల సిబ్బందితో సంబంధాలు పెట్టుకుని ఈ దందా సాగించినట్టు తెలిసింది.
 
ఆస్పత్రుల్లో పసిబిడ్డల చోరీ, బిడ్డలను పోషించే శక్తిలేని నిరుపేద దంపతులను ఉచ్చులోకి దించడం ద్వారా పిల్లలను విక్రయించి వీరు కోట్లు గడించినట్టు తెలిసింది. ఈ దందా నడిపేందుకు కిరాయి గూండాలతో ఓ ముఠాను కూడా ఆమె నడుపుతున్నట్టు సమాచారం. పురపాలక సంఘం అధికారులు కూడా ఆమెకు సహకరించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో ఉన్నతస్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
 
70 వేలకు ‘ఒరిజినల్‌’ బర్త్‌ సర్టిఫికెట్‌..
తర్వాత ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తల్లిదండ్రుల సంతకాలు తీసుకొని, అప్పగిస్తానని కొనుగోలుదారులకు అముదా భరోసా ఇవ్వడం కూడా ఆడియో క్లిప్‌లో ఉంది. అదనంగా రూ.70,000 ఇస్తే బిడ్డ పేరిట ‘ఒరిజినల్‌’ బర్త్‌ సర్టిఫికెట్‌ కూడా మున్సిపాలిటీ నుంచి ఇప్పిస్తానని కొనుగోలుదారులకు భరోసా ఇచ్చారు. తద్వారా బిడ్డను విదేశాలకు తీసుకెళ్లేందుకు కూడా ఇబ్బంది ఉండదని చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *