40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు: మోదీ సంచలన ప్రకటన


న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం.. రాష్ట్రంలోని టీఎంసీ ఎమ్మెల్యేలంతా ఆ పార్టీ వదిలి బీజేపీలోకి వస్తారంటూ సంచలన ప్రకటన చేశారు. బెంగాల్‌లోని సారంపూర్‌లో ఇవాళ జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ… ‘‘దీదీ, మే 23న ఫలితాలు వెలువడే రోజు ప్రతిచోటా కమలం వికసిస్తుంది. మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని వదిలేస్తారు. ఇవాళ కూడా 40 మంది మీ ఎమ్మెల్యేలు నాతో మాట్లాడారు..’’అని పేర్కొన్నారు.
 
బెంగాల్ సీఎం మమతపై ప్రధాని మోదీ విమర్శలు ఎక్కుపెట్టడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు జరిగిన ర్యాలీల్లో మమతను ‘‘స్పీడ్ బ్రేకర్’’ అంటూ అభివర్ణించిన సంగతి తెలిసిందే. ‘‘పశ్చిమ బెంగాల్‌లోని అభివృద్ధి ప్రాజెక్టులన్నిటీని ఆమె స్పీడ్ బ్రేకర్‌లా అడ్డుకుంటున్నారు..’’అని మోదీ వ్యాఖ్యానించారు. ఇటవల కూచ్ బెహార్‌లో జరిగిన ర్యాలీలోనూ ఆయన మమతపై విమర్శలు సంధించారు. ‘‘భారత్‌కు ఇద్దరు ప్రధానులు’’ కావాలంటున్న వారికి మమత మద్దతు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు. కాగా మమతా బెనర్జీ సైతం మోదీ అంతే స్థాయిలో తిప్పికొడుతున్నారు. ప్రధాని మోదీ ‘‘కాలం చెల్లిన నాయకుడని’’.. ఆయన పాలన త్వరలోనే ముగుస్తుందని ఆమె ఇటీవల ర్యాలీల్లో పేర్కొన్నారు. ‘‘అధికారం కోల్పోయే ముందు కూడా ఆయన మానసికంగా అందుకు సిద్ధపడడం లేదని’’ ఆమె ఎద్దేవా చేశారు. 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *